కాంగ్రెస్‌ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు

123456

– మంత్రి పోచారం

హైదరాబాద్‌,అక్టోబర్‌ 14(జనంసాక్షి): తెదేపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో అనుసరించిన విధానాల వల్లే రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఆలోచించి ఉంటే… ప్రస్తుతం రైతన్నల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి కేటాయింపులకు అనుగుణంగా ఆనాడు ప్రాజెక్టులు కట్టి ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకున్న కాంగ్రెస్‌ నేతలు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పంటకు కనీస మద్దతు ఇవ్వాలని కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని మంత్రి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సమైక్య పాలనలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఉద్ఘాటించారు. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఇచ్చిన హావిూలతో పాటు ఇవ్వని హావిూలను కూడా సీఎం నెరవేరుస్తున్నారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌ను మించిన దోఖాబాజ్‌ ఇంకోటి లేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌ విమర్శించారు. ప్రాజెక్టులు కట్టి ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారు కాదన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మద్దతుధర పెంపునకు కేంద్రాన్ని ఒప్పించాలని సవాల్‌ చేశారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నవారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, వారి సంక్షేమానికి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ సర్కారు కృషి చేస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి పొందడానికి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. 34 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రుణమాఫీలో తమకు సహకరించాలని కోరినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందజేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.480 కోట్లను వారంలో చెల్లించినట్లు చెప్పారు. విత్తనాలు, ఎరువులను అందజేయాలని రైతులు అడిగితే లాఠీచార్జి చేసిన ఘనత గత ప్రభుత్వాలదని మంత్రి తెలిపారు. రైతన్న అన్నం తినడానికి వెళ్లినప్పుడు చెప్పులు క్యూలో పెట్టి విత్తనాలు, ఎరువులను తీసుకోవాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో వాటిని అందజేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం రూ.200 కోట్లతో సబ్సిడీపై అందజేసినట్లు చెప్పారు. రైతులు పండించిన పంటలు నిల్వ ఉంచుకోవడానికి వెయ్యి కోట్ల రూపాయలతో గోదాములు నిర్మించామని తెలిపారు. 17 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించి రైతాంగాన్ని ఆదుకున్నామన్నారు. నిరంతర కరెంటు సరఫరాకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. శాశ్వత కరువు నివారణ కోసం రూ.లక్షా 50 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. కోటి ఎకరాలకు రెండు పంటలు పండించేందుకు సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మిషన్‌ కాకతీయలో భాగంగా రాష్ట్రంలోని 18 వేల చెరువుల పూడిక పనులకు రూ.2500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంటే కాంగ్రెస్‌,టిడిపి,బీజేపీలకి కన్పించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. హార్టికల్చర్‌ ద్వారా డ్రిఫ్ట్‌ ఇరిగేషన్‌, ఎస్సీ, ఎస్టీ వారికి వందశాతం సబ్సిడీని అందజేస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో రైతులకు ఇలాంటి సబ్సిడీ, రాయితీలు అందించడం లేదని తెలిపారు. పాలీహౌస్‌ కింద ఇప్పటి వరకు రూ.250 కోట్ల సబ్సిడీని అందజేసినట్లు చెప్పారు. రాయితీల కింద సుమారు రూ.1350 కోట్లు సంవత్సరానికి అందిస్తున్నామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు, యంత్రాలను 50 శాతం సబ్సిడీ కింద రూ.450 కోట్లు చెల్లించామని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆత్మహత్యలు లేని తెలంగాణగా మారుస్తామన్నారు.  గత ప్రభుత్వాల వల్లే ఫీజురీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు ఏర్పడ్డాయని పోచారం అన్నారు.