కాబోయే సీఎం కేటీఆర్

ముందస్తు శుభాకాంక్షలు  : పద్మారావు

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎస్‌సీఆర్‌ఈఎస్‌ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ అతి త్వరలో కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున శుభాకాంక్షలు చెబుతున్నా. కేటీఆర్‌ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పద్మారావు అన్నారు. మంత్రి కేటీఆర్‌ సభలో ఉండగానే పద్మారావు శుభాకాంక్షలు తెలిపారు.కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు అంటూ పద్మారావు సంభోదించడం .. కేటీఆర్‌ ముఖ్యమంత్రి అనే ఊహాగానాలకు మరింత బలం  చేకూర్చాయి. గత రెండు రోజులుగా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు పెద్దపీట వేయాలని కోరారు. హై స్పీడ్‌ రైళ్లతో మూరుమూల ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని, ఎక్కడో ఉన్న ఆదిలాబాద్‌, కరీంనగర్‌ , ఖమ్మం నుంచి గంటలో హైదరాబాద్‌ చేరుకోవచ్చన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్వే వ్యాగన్‌, కోచ్‌ ఫ్యాక్టరీ కేటాయిస్తామని ఇప్పటి వరకు కేటాయించలేదు. 130 ఎకరాల భూసేకరణ చేయమంటే 350 ఎకరాల భూసేకరణ చేశాం. దక్షిణాది రాష్ట్రాలకు హై స్పీడ్‌ రైళ్లు, బుల్లెట్‌ రైళ్లను కేటాయించలేదు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను విస్మరించింది. కనీసం రాబోయే బడ్జెట్‌లో అయినా దక్షిణాది రాష్ట్రాలకు పెద్దపీట వేయాలి. తెలంగాణ ప్రభుత్వం రైల్వే ఉన్నతిని కాంక్షించే ప్రభుత్వం. రైల్వే ఉద్యోగుల హక్కులకు భంగం వాటిల్లితే ..మీ పక్షాన నిలుస్తాం’’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.