కామన్‌ విద్యావిధానం రావాలి 

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రస్తుత విద్యావిధానంలో అసమానతలు తొలగాలంటే కామన్‌ విద్యావిధానమే శరణ్యమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా కామన్‌ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యా వ్యాపారాన్ని నిరోధించాలంటే దీనితోనే సాధ్యమన్నారు. విద్యా వ్యవస్థ మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికలో నైపుణ్యం పెంచుకోవాలని ఉపాధి, ఉద్యోగం కోసం విద్యార్థులను సమాయత్తం చేయాలని సూచించారన్నారు. విద్య ప్రజల ప్రాథమిక హక్కు అని ఆనాడు జ్యోతిబాఫూలే, సావిత్రి బాయి ఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన కృషిని కమిటీ నివేదికలో పేర్కొనక పోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం సుబ్రహ్మణ్య స్వామి కమిటీ నివేదికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కామన్‌విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యాహక్కు పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నామన్నారు.