కార్తీక చివరి వారంతో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా  శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాలకు భక్తులు పోటెత్తారు.  తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మురమళ్ల భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి, ముమ్మిడివరం ఉమాసూరేశ్వరస్వామి, కుండలేశ్వరం పార్వతీకుండలేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అటు అన్నవరం రత్నగిరిపై మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. అలాగే పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం, కాళహస్తి తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తికమాసం నాలుగో సోమవారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తజనం బారులు తీరడంతో స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. అధికారులు భక్తులకు శ్రీఘ్ర దర్శనం అమలు చేస్తున్నారు. ఈ సాయంత్రం ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అదేవిధంగా భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదావరి నదిలో కార్తిక దీపాలు వదిలారు. ధర్మపురి, కాళేశ్రం తదితర ప్రాంతాల్లో కూడా భక్తులు ఆలయాలరు పోటెత్తారు.