కార్తీక శోభతో అలరారిన రాజన్న ఆలయ ప్రాంగణాలు

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానం కార్తీక శోభతో అలరారింది. ఆదివారం సెలవు రోజు సందర్భంగా ఆలయానికి వచ్చిన వేలాది భక్తులు వివిధ స్థలాల్లో వెలిగించిన కార్తీక దీపాల వెలుతురులో ఆలయ ప్రాంగణాలు భక్తిభావంతో పులకరించాయి. వేకువ జామునే ధర్మగుండానికి చేరుకున్న భక్తులు తమ కుటుంబాలతో కలసి పవిత్ర స్నానాలాచరించారు. . ఆలయ ప్రధాన ద్వారం, ప్రవేశద్వారాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్థలాల్లో కొబ్బరికాయలు కొట్టి అగరువత్తులతో ధూపం వేశారు. ప్రవేశ ద్వారం వద్ద గల వేపచెట్టు కింద, ఆలయంలోని ధ్వజస్థంబం వద్ద, ముఖ్యంగా గండాదీపంలో వత్తులు వేసి, కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం క్యూలైన్లలో వెళ్ళి రాజన్నకు మొక్కుకున్న కోడె మొక్కులు, తలనీలాలు, తదితర మొక్కుబదులు చెల్లించుకుని గర్భగుడిలోని గణపతి సహిత శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారలను దర్శించుకున్నారు. హుండీలలో మొక్కుబడి కానుకలను వేసి తమ కుటుంబాలను చల్లంగ రక్షించాలని రాజన్నను వేడుకున్నారు.