కార్పొరేట్లకు రూ.12లక్షల కోట్లు మాఫీ

` సామాన్యులకు మాత్రం మొండిచేయి
` అబద్ధమని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా
` బీజేపీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పులు
` మోదీ సర్కారు వైఖరిపై మండిపడ్డ కేటీఆర్‌
` బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించాల్సిందే
` పనిమంతులకే మళ్లీ పట్టం కట్టండి
` పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి
` నారాయణపేట సభలో మంత్రి కేటీఆర్‌
నారాయణపేట(జనంసాక్షి): ప్రధాని మోదీ కార్పొరేట్లకు రూ. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాడని, ఇది నిజమో కాదో చెప్పాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు. తాను చెప్పింది అబద్ధమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఒక వేళ వాస్తవమైతే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులతో మనం నాగరికం వైపు పోతుంటే.. బీజేపీ నాయకులు మాత్రం అనాగరికం వైపు వెళ్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ, దగ్బులాజీ డైలాగులు కొడుతూ విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని నిప్పులు చెరిగారు. దయచేసి ఆలోచించండి. ఆగం కాకండి. కేసీఆర్‌ అప్పుల పాలు చేసిండు అని ఒకడు అంటుండు. నేను చెప్పెది తప్పు అయితే వాళ్లు వేసే ఏ శిక్షకైనా సిద్ధం. బడ్జెట్‌లో కేంద్రం చెప్పిందే నేను చెప్తున్నాను. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ దేశానికి ఇప్పటి వరకు 14 మంది ప్రధానులు పని చేశారు. వారు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లు. మోదీ ప్రధాని అయ్యాక చేసిన అప్పు.. రూ. 100 లక్షల కోట్లు. దేశంలో పుట్టే ప్రతి బిడ్డ విూద రూ. లక్షా 25 వేల అప్పు మోపుతున్నది మోదీ కాదా? అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ విూద అదనంగా సెస్సులు వేసి రూ. 30 లక్షల కోట్లను మోదీ వసూలు చేసిండు అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.  ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. పాలమూరు ఎంపీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతవు అని మోదీని ఉద్దేశించి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. పాలమూరు `రంగారెడ్డి పథకానికి మోకాలడ్డు పెట్టినందుకా? కృష్ణా జలాల్లో నీటి వాటాలు తేల్చనందుకు ఓటు వేయాలా..? మా పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు ఓటు వేయాల్నా? అని కేటీఆర్‌ నిలదీశారు.ఇక మోదీ దేవుడు అని ఒకాయన అంటుంటుండు. ఆయన ఎవరికి దేవుడు అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సిలిండర్‌ రేటు పెంచి క్టటెల పొయ్యి దిక్కు చేసినందుకు ఆడబిడ్డలకు మోదీ దేవుడా? పెట్రోల్‌ రేట్‌ పెంచినందుకు మోదీ దేవుడా..? ధరల పెరుగుదలకు కారణం ఎవరు.. మోదీ కాదా..? అని కేటీఆర్‌ మండిపడ్డారు. రైతులపై ఆదాయపు పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారు విబేక్‌ దేబ్‌రాయ్‌ ఒక పత్రికలో వ్యాసం రాశారు. ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిపోయింది. డబుల్‌ ఇంజిన్‌ పాలనలో రైతుల ఆదాయం డబుల్‌ అయింది. ఇక రైతులపై ఆదాయపు పన్ను వేయాలని ఆయన రాసుకొచ్చారు. ఇంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు. ఈ విషయాన్ని రాసిన వ్యక్తి అల్లాటప్పా వ్యక్తి కాదు. ప్రధానికి పెద్దదిక్కుగా ఉన్న ఆర్థిక సలహాదారే రాసిండు అని కేటీఆర్‌ వివరించారు. ఆదాయమే లేదని ఏడుస్తుంటే.. రైతు విూద ఆదాయపు పన్ను వేస్తడంట. దయచేసి రైతన్నలు ఆలోచించాలి అని కేటీఆర్‌ సూచించారు.
బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించాల్సిందే
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండి.. కేసీఆర్‌ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్‌ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతలకు కేంద్రం అడ్డుపడ్డా కూడా ఆ పని పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించే బాధ్యత కచ్చితంగా కేసీఆర్‌ ప్రభుత్వానిదే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. అవసరమైతే న్యాయపోరాటం చేద్దాం. ప్రజాకోర్టులో తేల్చుకుందాం అని కేటీఆర్‌ చెప్పారు. వీళ్లందరిని మట్టి కరిపించి, 2024లో కేంద్రంలో మనకు అనుకూలంగా వచ్చే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. రైతు, పేద వ్యతిరేకులను, మతం పేరిట పంచాయితీ పెట్టి.. నాశనం చేసే వారిని తిప్పితిప్పి కొడుదాం అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  పాలమూరు`రంగారెడ్డికి కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కోరారు. కొన్ని గ్రామాల కోసం కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కొట్టుకుంటున్నారని, వాళ్లనే ఆపలేని మోదీ రష్యా`ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్రం వైఖరితో రైతుల ఆదాయం కాదు.. వారి కష్టాలు, పెట్టుబడి రెట్టింపు అయ్యిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మహబూబ్‌నగర్‌లో జరుగుతున్నాయని తెలిసింది. అక్కడ సొల్లు పురాణం మాట్లాడుతున్నారు. నారాయణపేట వేదికగా డిమాండ్‌ చేస్తున్నా…రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటి పోయింది. ఎప్పుడైనా అన్నదమ్ముళ్లు వేరుపడితే ఆస్తిపంపకాలు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. తెలుగు రాష్టాల్రురెండు అయ్యాయి. రాష్ట్రం వేరు పడక ముందు 811 టీఎంసీల వాటా మనకు ఉందని ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. ట్రిబ్యునల్‌కు లేఖ రాసేందుకు కేంద్రానికి, మోదీకి సమయం దొరకడం లేదట. పంచాయితీని సెటిల్‌ చేసే ఉద్దేశం వారికి లేదు. ఎందుకంటే పాలమూరు ఎండాలి. ఎండితేనే కడుపు మండి ఉన్న ప్రభుత్వం విూద తిరగబడి మాకు అవకాశం ఇస్తారనే దురాలోచనతో ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. 95 శాతం లోకల్‌ రిజర్వేషన్లు తీసుకొచ్చి 2 లక్షల 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. అదే విధంగా నిధుల విషయంలో భారీగా విడుదల చేస్తున్నాం. తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందనే విషయాన్ని ఆలోచించాలని కెటిఆర్‌ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అడ్డుకట్ట వేసినప్పటికీ, కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ నీళ్ల పంపకాలను తేల్చకపోయినప్పటికీ 11 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం అని కేటీఆర్‌ తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేటీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, లేఖలు రాసిన స్పందన లేదన్నారు. దున్నపోతు విూద వాన పడ్డట్టే తప్ప స్పందన లేదు. విూకు చిత్తశుద్ధి ఉంటే.. మహబూబ్‌నగర్‌ జిల్లా విూద ప్రేమ ఉంటే.. పాలమూరులో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న విధంగానే 500 టీఎంసీల కేటాయించాలని మోదీని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేయండి. దమ్ము, తెగువ ఉంటే ఆ తీర్మానం చేసి విూ చిత్తశుద్ది రుజువు చేసుకోండి అని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను విమర్శించడం కాదు. పాలూమరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయో హోదా ఇవ్వాలని మోదీని డిమాండ్‌ చేయండి అని కేటీఆర్‌ అన్నారు.