కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా కార్మిక సంక్షేమాధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు ఫారాలు అన్ని జిల్లాల్లోని సహాయ కార్మిక కమిషనర్‌ కార్యాలయంలో పొందవచ్చన్నారు.  పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 15లోపు కార్మిక శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక, ఇతర ట్రస్టుల్లో పనిచేసే వారి పిల్లలు అర్హులని అన్నారు. టెన్త్‌, ఐటీఐ విద్యార్థులకు రూ.వెయ్యి, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.1500, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, లా, బీఎస్‌సి అగ్రికల్చర్‌, వెటర్నరీ, నర్సింగ్‌ హార్టికల్చర్‌, బీసీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, డిఎ/-లామా ఇన్‌ మెడికల్‌ లేబరెటరీ టెక్నీషియన్‌, పిజీ డిప్లమా ఇన్‌ మెడికల్‌ లాబోరేటరీ టెక్నిషియన్‌ కోర్సులకు రూ.2000 ఉపకార వేతనం చెల్లిస్తున్నారు. అభ్యర్థులు క్లాస్‌, కోర్సుల్లో మార్కుల శాతం ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సహాయ కమిషనర్లు మే నాటికి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.