కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు

కడప,నవంబర్‌18(జ‌నంసాక్షి): అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మనోహర్‌ విమర్శించారు. కార్మికుల ఓట్లతో గ్దదెఎక్కిన ప్రభుత్వాలు కార్మికుల వారి కడుపులు కొడుతూ దుర్మార్గానికి పాల్పడుతున్నాయని తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పని చేస్తున్న అసంఘటిత రంగ కార్మిక వర్గానికి రూ.18వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి హక్కులను కాపాడుకోవడం కోసం ఆందోళనలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులందరికీ రూ.18వేలు వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, సమగ్ర చట్టం చేయాలని, ఖాళీలన్నీ భర్తీ చేయాలని, ఆశా, ఐకెపి, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.5వేలు, మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పాలకులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. దేశంలో కార్మిక వర్గం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.మున్సిపాలిటీల్లో 279 జిఒను రద్దు చేయాలని, హమాలీ, ఆటో, మోటార్‌ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మిక సంఘాలతో జెఎసి సమావేశం నిర్వహించాలని, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటికరించే విధానానికి స్వస్థి పలకాలని అన్నారు.