కాలిఫోర్నియా కర్చిచ్చులో 130 మంది గల్లంతు

వారంతా 70 ఏళ్ల పైబడిన వారే

తీవ్రంగా గాలిస్తున్న సహాయక సిబ్బంది

కాలిఫోర్నియా,నవంబర్‌15(జ‌నంసాక్షి): అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చులో

ఇప్పుడు 130 మంది గల్లంతయ్యారు. వారు ఎక్కడికి పోయారన్నది మిస్టరగా మారింది. కార్చిచ్చు కారణంగా అక్కడి పారడైజ్‌ నగరాన్ని కాల్చి బూడిద చేసింది. లక్షల ఎకరాలు, వేలాది ఇళ్లు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దావానలం కారణంగా ఇప్పటికే 59మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 130 మంది ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన వారి వివరాలను బుధవారం అధికారులు విడుదల చేశారు. కనిపించకుండాపోయిన వారిలో ఎక్కువ మంది పారడైజ్‌లోని బుట్టే కౌంటీకి చెందిన వారు. వారు దాదాపు 70, 80, 90 సంవత్సరాల వయసు గల వారు. ఈ ప్రాంతం గతవారం చెలరేగిన మంటల కారణంగా నామరూపాలు లేకుండా పోయింది. వీరు అగ్నికి ఆహుతి అయ్యారా అన్నది తెలియాల్సి ఉంది.

సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. బాధితులను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సియెర్రా నేవెడా పర్వతాల సవిూపంలో ఉన్న పారడైజ్‌ నగరంలో 26వేల మంది జనాభా ఉండేవారు. గత వారం చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి పారడైజ్‌ నగరాన్ని కాల్చేశాయి. గాలులు విపరీతంగా వీయడంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేయలేకపోయారు. సహాయక సిబ్బంది ప్రతి ఇంటిని, కాలిపోయిన వాహనాలను గాలించి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. పారడైజ్‌ నగరం మొత్తాన్ని పునాదుల నుంచి నిర్మించాలని, ఇళ్లు, వ్యాపార సముదాయాలు, మౌలిక వసతులు అన్నీ నాశనమైపోయాయని అధికారులు చెప్తున్నారు. లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది ఈ మంటను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా భారీ నష్టం జరగనే జరిగింది.