కాల్పుల విరమణకు పాక్‌ తూట్లు

గ్రామాలపై బుల్లెట్లు.. నలుగురు పౌరుల మృతి
శ్రీనగర్‌,మే23( జ‌నం సాక్షి): రంజాన్‌ సందర్భంగా జమ్మూ-కశ్మీరులో సైనిక కార్యకలాపాలకు విరామం ఇవ్వాలని భారతదేశం నిర్ణయిస్తే  పాకిస్థాన్‌ మ్‌ఆత్రం కాల్పులు  తన దాష్టీకాన్ని చాటుకుంది. పవిత్ర మాసంలో కూడా విచక్షణా రహితంగా భారతదేశంపై కాల్పులు జరుపుతోంది. బుధవారం మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల వెంబడి భారతదేశం వైపు ఉన్న గ్రామాలపై పాకిస్థాన్‌ ఇష్టానుసారం జరిపిన కాల్పుల్లో నలుగురు సామాన్య ప్రజలు మరణించారు. 35 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. జమ్మూ-కశ్మీరులోని మూడు జిల్లాల్లోని గ్రామాలపై పాకిస్థాన్‌ బుధవారం కాల్పులు జరిపింది. కఠువా, సాంబ, జమ్మూ జిల్లాల్లో బుధవారం ఉదయాన్నే సుమారు 30 సరిహద్దు గస్తీ స్థావరాలపై ఈ కాల్పులు జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. 120 ఎంఎం, 180 ఎంఎం మోర్టార్లతో హీరానగర్‌, ఆర్నియా, ఆర్‌ఎస్‌ పుర, కన్హచక్‌ ప్రాంతాల్లో దాడులు చేసినట్లు భారత్‌ భద్రతా దళాల అధికారులు తెలిపారు. మంగళవారం పాకిస్థాన్‌ జరిపిన అమానుష దాడుల్లో 13 మంది భారతదేశ పౌరులు గాయపడిన సంగతి తెలిసిందే. పాక్‌ సోమవారం జరిపిన దాడుల్లో ఓ ఎనిమిది నెలల చిన్నారి మరణించాడు.