కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు:ఎమ్మెల్యే రమేశ్‌బాబు 

రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కాళేశ్వరం రివర్స్‌పంపింగ్‌ పనులు, కలికోట సూరమ్మ రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తవుతయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాళేశ్వరం నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీకి తరలించి, వరద కాలువ ద్వారా పొలాలకు నీరందించనున్నట్లు చెప్పారు. దీంతో కాలువల పరిసరాల్లోని చెరువులు, బావులు నీటితో కళకళలాడుతాయన్నారు. వరద కాలువ నీటిని చెరువులకు మళ్లించేందుకు అవసరమైన తూములను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
రైతులకు ప్రయోజనం చేకూర్చాలని కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటిని రైతులు వినియోగించుకోవాలన్నారు. రైతులను అన్ని రంగాల్లో పోత్రహించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుంద ని పేర్కొన్నారు. సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యతనిచ్చామనీ, అందుకోసం నిధులు అధికంగా విడుదల చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు.