కాళేశ్వరంతో తీరనున్న నీటి సమస్య

విపక్షాలవి అర్థం లేని విమర్శలు: గుడిపూడి

సూర్యాపేట,జూలై11(జ‌నం సాక్షి): అద్భుతమైన నిర్మాణాలు చేపట్టి సంచలనాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేటకు గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు అద్భుతమైన ప్రణాళికలు రూపొందించారని రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌ గుడిపూడి వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఇది సూర్యాపేటకు వరం కానుందన్నారు. ముందు తరాలకు నీటి కష్టాలు ఉండొద్దనే లక్ష్యంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు సూర్యాపేట రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజల పాలిట వరంగా ఉండబోతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు సూర్యాపేటకు చేరితే ప్రతిపక్షాలు పూర్తిస్థాయి ఆదరణ కోల్పోతాయనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రతిపక్షపార్టీలకు అధికారం కలగానే మిగిలిపోనుందని అన్నారు. కాంగ్రెస్‌ కనుచూపు మేరలో కూడా లేకపోగా, బీజేపీకి తెలంగాణలో అడ్రస్సే లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని మరో 15 ఏళ్లపాటు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి కేసీఆరే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు భ్రమలో ఉన్నాయని కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇటీవల ఆ రెండు పార్టీలు బస్సు యాత్రలు చేసినా, విూటింగులు పెట్టినా జనం వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో సీఎం కేసీఆర్‌ ఎలాగైతే చైతన్యం తెచ్చారో రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా కేసీఆర్‌ ప్రజలను సంక్షేమ పథకాలతో ఆకర్షితులను చేస్తున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, మిష న్‌ కాకతీయ వంటి పథకాలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 నియోజకవర్గాలలో బీసీ గురుకులాలను, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు.