కాళేశ్వరంతో తీరుతున్న కష్టాలు

పండగలా సాగుతున్న వ్యవసాయం

మండలి చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు

వరంగల్‌,నవంబరు 26(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ కష్టంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ జలాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ మత్తడి దుంకుతున్నాయని మండలి చీఫ్‌ విప్‌ బి. వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన చెప్పారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఉద్యమ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో పండుగ వాతావరణంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరానికి మించి ధాన్యం సేకరిస్తున్నట్లు వివరించారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలన్న లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్కరూ వినియో గించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రులలు ఆకర్షితులై ప్రశంసల వర్షం కురిపిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రభుత్వ పనితీరు, సీఎం కేసీఆర్‌ ఆలోచనా తీరును మెచ్చుకున్న ట్లు తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ప్రభుత్వ పనితీరును గుర్తించకుండా ఊదరగొట్టే ఉపన్యాసాలతో కాలం వెలిబుచ్చుతున్నట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల సేవలను విస్తృతం చేసేలా కేంద్ర మంత్రులు కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి ప్రభుత్వం నిర్దేశిరచిన గిట్టుబాటు ధర పొందాల్సిందిగా కోరారు.