కాళేశ్వరంతో మారనున్న దశ

వేలాది ఎకరాలకు సాగునీరు

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డి

మెదక్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్‌ నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేదంర్‌ రెడ్డి తెలిపారు. మెదక్‌ జిల్లాను ప్రత్యేకంగా చేసుకోవడం అన్నది ఎన్నో ఏళ్ల కలని, దానిని సాకారం చేసుకున్నామని అన్నారు. ఇదంతా కేవలం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కెసిఆర్‌ వల్లనే సాధ్యమయ్యిందన్నారు.

అరవైయేండ్ల పాలనలో కాంగ్రెస్‌, టీడీపీ నాయకులకు తెలంగాణ ప్రజలకు ఏమి ఒరగబెట్టారని ప్రశ్నించారు. మహాకూటమి పార్టీలు పొత్తులలో రెండునెలలుగా సీట్ల పంపకమే చేసుకోలేని వారు రాష్ట్రంలో పాలన ఎలా చేస్తారని ఎద్దేవ చేశారు. క్షేత్రస్థాయిలో మహాకూటమిని నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేసిన ఘనత కేసీఆర్‌ సొంతమని కితాబిచ్చారు. రైతుబంధు, రైతు బీమా ఎంతో రాష్ట్ర రైతాంగం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ, భగీరథ వంటి పథకాలు ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తున్నాయ న్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో తెరాస మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో ప్రజలు తమ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మారథం పడుతున్నారని పేర్కొన్నారు.