కాళేశ్వరంపై ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి): ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాళేళ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. కేవలం కమిషన్లతో జేబులు నింపుకోవడానికే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. అటవీ, పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని విమర్శించారు. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.తెరాస ప్రభుత్వంలో అణగారిన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఉత్తమ్‌ ఆరోపించారు. తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ మహంకాళి శ్రీనివాస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు. మంత్రి సాక్షిగా తనకు అన్యాయం జరిగిందంటూ ఆ పార్టీ కార్యకర్త ఆయూబ్‌ఖాన్‌ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని చెప్పారు. తెరాస ప్రభుత్వానికి దళిత, మైనార్టీ, అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయినట్లు నటించకుండా మేల్కొని ప్రజలకు న్యాయం జరిగేట్లు చూడాలని డిమాండ్‌ చేశారు.