కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు

హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అఖిలప్రియను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఆమె భర్త భార్గవరామ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియను బేగంపేటలోని లెర్నింగ్‌ సెంటర్‌కు పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టులో అఖిలప్రియను హాజరుపరచనున్నారు.బోయిన్‌పల్లిలో నిన్న రాత్రి బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కిడ్నాప్‌ వ్యవహారంలో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మనోవికాస్‌ నగర్‌లోని తమ స్వగృహంలో ఉన్న ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావును మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. మూడు కార్లలో వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్‌, చరవాణిలను కూడా పట్టుకుపోయారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌నకు గురైనట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ ముగ్గురిని వికారాబాద్‌లో గుర్తించారు.

ఐటీ అధికారులమని వెళ్లి కిడ్నాప్‌ చేశారు: సీపీ

హఫీజ్‌పేట భూ వివాదం వ్యవహారం నేపథ్యంలో నమోదైన కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్‌ చేశామని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిన్న రాత్రి కిడ్నాప్‌ కేసు నమోదైందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. మనోవికాస్‌ నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీలో ఉంటున్న ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు సోదరులను 10 మందితో కూడిన బృందం కిడ్నాప్‌ చేసిందన్నారు. ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చ్‌ వారెంట్‌ చూపించి ఇంట్లోకి వెళ్లారని.. ఆ తర్వాత ఇంట్లోని మహిళలు, చిన్నారులను ఓ గదిలో బంధించి ప్రవీణ్‌, సునీల్‌, నవీన్‌లను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారన్నారు. ఆ తర్వాత మనీశ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 15 బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సహా మరికొందరికి సంబంధముందని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు, ఇతర జిల్లాలతో పాటు ఏపీ పోలీసులకూ సమాచారం ఇచ్చామన్నారు. ఈ క్రమంలో వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో నార్సింగి- కోకాపేట ప్రాంతంలో ముగ్గురు సోదరులను నిందితులు విడిచిపెట్టారని సీపీ చెప్పారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3 భార్గవ్‌రామ్‌ను చేర్చామని.. మిగతా వారి పేర్లపై విచారణ జరుపుతున్నామన్నారు. కిడ్నాప్‌ కేసులో భాగంగా ఈ ఉదయం 11.20 గంటల ప్రాంతంలో భూమా అఖిలప్రియను అరెస్ట్‌ చేసి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అంజనీకుమార్‌ వివరించారు. మిగతా నిందితులు శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్‌గా గుర్తించామని చెప్పారు. వాళ్లంతా పరారీలో ఉన్నారని.. త్వరలోనే పట్టుకుంటామన్నారు