కుట్ర ప్రకారమే..  జగన్‌పై హత్యాయత్నం జరిగింది


– ఎన్‌ఐఏ దర్యాప్తును ప్రభుత్వం అడ్డుకుంటుంది
– చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు
– వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదు
– వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్ర ప్రకారమే జరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.  హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముందుకు సాగకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగడుగునా అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ కేసును నీరుగార్చడానికే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఎన్‌ఐఏ విచారణను ఆపేందుకు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాశారని తెలిపారు. ఈ కేసులో ఆధారాలను ఎన్‌ఐఏకు ఇవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేపదే ఎన్‌ఐఏ విచారణకు చంద్రబాబు అడ్డుపడటం చూస్తుంటే ఈ కేసులో ఆయన పాత్ర ఉందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తీరును అంతా గమనిస్తున్నారని.. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు.  చంద్రబాబు రాష్ట్రంలో సమస్యలను వదిలి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని, కానీ ఆయనతో విూటింగ్‌ అంటే ఇతర పార్టీల నేతలు టైం ఇవ్వని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. స్వప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈవీఎంలు వద్దని అంటున్నారని.. అయితే 2014లో ఆయన ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే గెలిచారా అంటూ ప్రశ్నించారు.