కుల్ భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై వెనక్కి తగ్గిన పాక్

ఇండియన్ నేవి మాజీ అధికారి కుల్‌  భూషణ్ జాదవ్‌ కు విధించిన ఉరిశిక్షపై పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. భారత్‌ తోపాటు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు రావడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. జాదవ్  తనకు విధించిన ఉరిశిక్షపై 60 రోజుల్లోపు పై కోర్టులో అప్పీల్ చేయవచ్చునని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ అన్నారు. అయితే కుల్‌ భూషణ్‌ పై తాము చట్ట ప్రకారమే ముందుకు వెళుతున్నామని.. వైఖరి సమర్థనీయమేనని స్పష్టం చేశారు. పథకం ప్రకారం జాదవ్ హత్యకు కుట్ర పన్నారన్న భారత్  ఆరోపణను ఖ్వాజా కొట్టి పారేశారు. అయితే జాదవ్‌ కు ఉరిశిక్ష విధించడం అసాధారణ చర్య అని పాక్ మీడియా వ్యాఖ్యానించింది. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని, భారత్  ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.  అటు  జాదవ్‌ కు ఉరిశిక్ష విధిస్తూ పాకిస్థాన్  తీసుకున్న నిర్ణయం అమెరికా విదేశీ సంబంధాల మండలి డైరెక్టర్  అల్యాస్సా ఆయ్రేస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాక్ నిర్ణయం అనుమానాస్పదం, అనిశ్చితికి నిదర్శనమన్నారు. ముంబై దాడి కుట్రదారుల కేసు ఏండ్ల తరబడి వాయిదా పడుతుంటే.. జాదవ్  కేసులో పాకిస్తాన్ త్వరితగతిన ఎలా నిర్ణయం తీసుకున్నదని ప్రశ్నించారు. అయితే అమెరికా విదేశాంగశాఖ, వైట్‌హౌస్ మాత్రం  జాదవ్ ఉరిశిక్షపై స్పందించేందుకు నిరాకరించాయి.

మరోవైపు  కుల్‌  భూషణ్  జాదవ్‌ రక్షించుకునేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నది. దీనిలోభాగంగా పాక్‌  లోని ఉన్నత స్థాయి న్యాయవాదుల సేవలను వినియోగించుకుంటామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్  తెలిపారు. సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్న ప్రముఖ న్యాయవాదులు అస్మా జెహంగీర్, అన్సార్  బర్నీ, జెబ్రాన్  నజీర్, అతియాజ్  అహ్సాన్‌ లను జాదవ్  తరఫున వాదించేందుకు భారత్ నియమించే అవకాశాలు ఉన్నాయి.