కుల వృత్తులకు గౌరమిచ్చింది కేసీఆర్‌ మాత్రమే

– మత్స్యకార్మిక వృత్తిని ప్రోత్సహించేందుకే చేపపిల్లల పంపిణీ
– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి చెరువులో 50 వేల చేపపిల్లలు వదిలిన తలసాని
మహబూబ్‌ నగర్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లోని కులవృత్తులు పాలకుల శ్రద్ధలేక నిర్వీర్యమవుతూ వచ్చాయని, ప్రత్యేక తెలంగాణ అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌ రాష్ట్రంలోని కులవృత్తులకు పునర్జీవం పోసేందుకు కంకణబద్దులై ముందుకు సాగుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి గ్రామ చెరువులో మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి తలసాని 50వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తలసాని ప్రసంగించారు. మాకు చేపపిల్లలు ఇవ్వమని ముఖ్య మంత్రిని ఎవ్వరు అడగలేదన్నారు. అయినా చేపల పెంపకమే వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న వారికి చేపలను పంపిణీ చేసేందుకు కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. చెరువులు, కుంటల్లో చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి మత్స్య కార్మికులను ఆదుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇప్పటికే గొల్లకురమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతి గొల్లకురమకు గొర్రెలను పంపిణీ చేయటం జరిగిందన్నారు. అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్‌, తెరాస ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తలసాని పేర్కొన్నారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి రాబోయే కాలంలో మా పరిస్థితి ఏమవుతుందోనన్న భయంతో కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధిని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టులను అడ్డుకొని ప్రాజెక్టుల పనులు మందుకు సాగకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం రైతులు, పేద వర్గాల అభివృద్ధికోసం అన్నింటిని ఎదుర్కొని ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.