కూటమికి అధికారం అప్పగిస్తే..  రాష్ట్రాన్ని బాబు చేతిలో పెట్టినట్లే


– తెలంగాణ ప్రజలకు ఇది తీరని నష్టం
– తొలుత నష్టపోయేది రైతాంగమే
– కాంగ్రెస్‌ నేతల మాయమాటలు ప్రజలు నమ్మకండి
– తెలంగాణలో అభివృద్ధి ముందుకుసాగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం
– విలేకరుల సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్గొండ, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) :  మహాకూటమికి అధికారం కట్టబెడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో పెట్టినట్లేనని, దీంతో మొట్ట మొదట నష్టపోయేది రైతులే అని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. నల్గొండలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న రూ.2లక్షల రైతుల రుణమాఫి హావిూ ప్రజలను మోసం చేయడం కోసమే అని అన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌ లీడర్‌ లు ముగ్గురు సీఎం అభ్యర్థులే అంటున్నారు. కొత్తగా దామోదర్‌ రెడ్డి కూడా సీఎం కావాలని యాగం చేస్తున్నాడని, వీళ్ళను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. మహాకూటమి దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతుందని, టికెట్ల కోసం కాంగ్రెస్‌ ఢిల్లీ,  టీడీపీ అమరావతి చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కోదండరాం, చాడ వెంకట్‌ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. మహాకూటమికి అధికారం కట్టబెడితే మొట్ట మొదట నష్టపోయేది రైతులేనని, ఇక్కడి నీళ్లను మళ్ళీ యథేచ్ఛగా ఆంధ్రకు దోచుకొనిపోతారని సుఖేందర్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2793 మంది రైతుల చనిపోతే వాళ్లలో 2594 మందికి ఎల్‌ఐసీ బీమా సొమ్మును వారి కుటుంబాలకు అందజేశామని సుఖేందర్‌ రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికాకారంలోకి రాగానే ఓకే విడతలో రైతులకు లక్ష రూపాయలను మాఫి చేస్తామని హావిూ ఇచ్చారు. కేసీఆర్‌ వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి పోతే.. ప్రధాన మంత్రిని కలిశారని ఉత్తమ్‌ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోడీ విదేశ పర్యటనలో ఉన్నారని, అలాంటప్పుడు ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. రైతుబంధుకు సంబంధించిన డబ్బులు రైతులకే అందుతాయని, అప్పులు కింద జమ కావని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని సుఖేందర్‌ రెడ్డి అన్నారు.