కూటమికి ఓటమి తప్పదు: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిండంతో పాటు గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల గూర్చి ప్రజలకు క్షుణ్ణంగా వివరించి ఓట్లు అడుగుతున్నామని వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. మహాకూటమి పేరుతో వస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీలకు డిపాజిట్‌ దక్కకుండా చేయడానికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ అభివృద్ది నినాదంతో అత్యధిక మెజార్టీతో గెలిపించి టీఆర్‌ఎస్‌ జెండాని ఎగురవేస్తామని అన్నారు. మహాకూటమి ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా తమగెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మహాకూటమిలో అభ్యర్థులు ఎవరన్నది ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతోనే వారి ఓటమి ఖరారైందన్నారు. గెలుపు చాతకాకనే ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని, ప్రజలకు కాంగ్రెస్‌, టీడీపీ చేసింది శూన్యమని అన్నారు. అందుకే వారు ఏ ముఖం పెట్టుకుని వచ్చి నేడు ఓట్లు అడుగుతారని, ప్రజల్లో తిరిగే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు.