కూటమికి ఓట్లేస్తే.. అభివృద్ధిని కాలదన్నుకున్నట్లే

 

– మన ప్రాజెక్టులను అడ్డుకొనే బాబుతో పొత్తా?

– టికెట్లు పంపిణీ చేసుకోలేనోళ్లు పాలన ఎలా చేస్తారు

– తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం

– ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్‌

– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : తెలంగాణలోని ప్రాజెక్టులకు అడ్డుపడే చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవటం దుర్మార్గమని, కూటమికి ఓట్లేస్తే తెలంగాణ అభివృద్ధిని మనంతట మనం కాలదన్నుకున్నట్లవుతుందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ లోని జలవిహార్‌ లో దివ్యాంగుల పెన్షనర్ల కృతజ్ఞత మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అపవిత్ర పొత్తులతో టీడీపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐలు ప్రజల ముందుకొస్తున్నాయని, వారి కుట్రలను తిప్పికొట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పొద్దున టికెట్లు ప్రకటిస్తే ఎవరొచ్చి గాంధీభవన్‌ తులుపులు పగలగొడతారోననే భయంతో అర్థరాత్రి కాంగ్రెస్‌ పార్టీ నేతలు టికెట్లు ప్రకటించిందన్నారు. ఏ చంద్రబాబు నాయుడైతే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలనే కుట్ర పన్నారో ఆ చంద్రబాబు కాళ్ల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలు తాకట్టు పెట్టారని, వీళ్లు తెలంగాణకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ బాగుపడాలని ఉంటుందని, ఆయన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందోనని చూసుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు లేఖలు రాశారని, తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకొనే వ్యక్తి పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవటం సిగ్గుచేటన్నారు. ఈ ఎన్నికల్లో తప్పుచేసి పొరపాటున కూటమి చేతులో అధికారం పెడితే.. మన ప్రాజెక్టులను మనమే వద్దనుకున్నట్లు అవుతుందని కేటీఆర్‌ అన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని, కూటమి కుట్రలను తిప్పికొట్టి కేసీఆర్‌కు మరోసారి సీఎం పీఠాన్ని కట్టబెట్టి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటం జరిగిందని, ఆ అభివృద్ధి ఆగకుండా మరింత అభివృద్ధి జరగాలంటే, దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా నిలవాలంటే, దేశానికే తెలంగాణ రైతులు ఆదర్శంగా నిలవాలంటే కచ్చితంగా మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రజలంతా గమనించి తెలంగాణ అభివృద్ధికోసం టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలని కేటీఆర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.