కూటమి కుట్రలను.. ప్రజలు తిప్పికొట్టండి

 

– తెరాసతోనే అభివృద్ధి సాధ్యం

– ఇంటింటి ప్రచారంలో ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కూటమి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ పట్టణంలో మంత్రి అల్లోల ఇంటింటి ప్రచారం చేపట్టారు. గొల్లపేటలో గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తనను మరోసారి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సమైక్యాంధ్రలో తెలంగాణ అభివృద్ధిని ఆంధ్రాపాలకులు విస్మరించారని, కేసీఆర్‌ పోట్లాడి తెలంగాణ తెచ్చుకొని నాలుగేళ్లలో అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆంధ్రాపార్టీ అయిన టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకొని మహాకూటమి అంటూ ప్రజల్లోకి వస్తుందన్నారు. వారు అధికారంలోకి వస్తే మళ్లీ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కాస్త.. మళ్లీ అభివృద్ధి కుంటుపడి వలసలు పోయే తెలంగాణగా మారుతుందన్నారు. ప్రజలంతా కూటమి కుట్రలను గమనించి తిప్పికొట్టాలని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజలకు సూచించారు. మహకూటమి నేతలకు బీ పారాలకే దిక్కులేదని.. వారు ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారన్నారు. మహకూటమి ద్రోహుల కూటమిని.. తెలంగాణ నుంచి దాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ తోనే అభివృద్ది సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ప్రజలే కారుగుర్తుకు ఓటు వేస్తామని చెప్పుతున్నారన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగున్నర ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయని, దీంతో రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో వంద స్థానాల్లో విజయం ఖాయమైందని అల్లోల

ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నో పథకాలను తీసుకొచ్చి అమలు చేయడంతోనే అవి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు. గ్రావిూణ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నందున మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో తన నామినేషన్‌కు ఇంత భారీ స్థాయిలో జనం తరలిరావడం ఇదే మొదటిసారని, తన విజయం ఖాయమైందని, ఇక మెజార్టీ మిగిలిందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ విజయానికి దోహదం చేస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో మహాకూటమి గల్లంతవ్వడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ధర్మాజీ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు డా.మల్లికార్జున రెడ్డి, ముర్సు సత్యనారాయణ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.