కూనంనేని దీక్ష భగ్నం

– అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
– చికిత్సకు నిరాకరించిన కూనంనేని
– ఆర్టీసీ ఉద్యోగుల సమస్య పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా – కూనంనేని
హైదరాబాద్‌ అక్టోబర్‌28 జనం సాక్షి  :   ఆర్టీసీ ఉద్యోగుల సమస్య పరిష్కారమయ్యే వరకు తన దీక్ష కొనసాగుతూనే ఉంటుందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నారాయణగూడ సీపీఐ కార్యాలయంలో 26నుంచి ఆయన ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఆయనను నారాయణగూడ పోలీసులు కూనంనేనిని అదుపులోకి తీసుకొని.. అత్యవసర చికిత్స కోసం నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సకు ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటంలో కేసీఆర్‌ ఖమ్మంలో అరెస్టు అయినప్పుడు సీపీఐ శాసన సభ్యుడిగా ఉండి ధైర్యం చెప్పానన్నారు. ఉద్యమ పోరాటాల ద్వారా వచ్చిన కేసీఆర్‌ ఉద్యమాలను అణచివేయడం సరికాదన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు కూనంనేని తరలించిన ఆస్పత్రి వద్దకుసీపీఐ నేతలు, ఆర్టీసీ కార్మికులు పెద్దెత్తున చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాగుట్ట పోలీసుల ఆధ్వర్యంలో నిమ్స్‌ ఆసుపత్రి ఎమర్జెన్సీ భవనం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.