కూరగాయల రైతులకు ప్రోత్సాహం

మార్కెట్లు విస్తరించే అవకాశాల కోసం ఎదురుచూపు

కరీంనగర్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో మినీ కూరగాయల మార్కెట్లు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించే కూరగాయాలను నేరుగా కరీంనగర్‌ పట్టణానికి తెచ్చుకుని అమ్ముకునేలా చేస్తేరైతులుకు మేలు కలుగుతుంది. అలాగే కూరగాయల ధరలు పెరగకుండా నిరంతరంగా వారు పంటలు పండిస్తే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు చేకూరుతుంది. కూరగాయలు కొనేందుకు ఐదారు కిలోవిూటర్ల దూరం నుంచి ప్రజలు రావాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొత్త మార్కెట్ల కోసం గత పాలకవర్గ సభ్యులు పలుమార్లు తీర్మానాలు చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినా ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. దీంతో తాము తెచ్చే కూరగాయలు అమ్ముకోవడానికి మార్కెట్‌ లేక రైతులు వీధుల్లో అమ్ముకుంటు న్నారు. దీంతో వారికి గిట్టుబాటు కావడం లేదు. అయితే ప్రజా అవసరాలకు తగ్గట్లు మార్కెట్లు ఉండాలనే ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణలోకిరావడం లేదు. నగరంలోని మూడు మార్కెట్ల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు కూడా అధికారులు ప్రతిపాదనలు చేస్తుండటంతో నిధుల సమస్య ముందుకు వచ్చింది. నిధులను శ్మశానవాటికలు, మార్కెట్ల అభివృద్ధి, మాంసాహార మార్కెట్లు, ఖాళీ స్థలాలకు ప్రహారీలు, కబేళాలు, కూడళ్ల అభివృద్ధికి కేటాయించడంతో ఆ నిధులు సరిపోయే పరిస్థితి లేదు. కొత్తగా మార్కెట్లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సంఖ్య తగ్గి ప్రధాన కూరగాయల మార్కెట్‌కు భారీగా రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. కాలనీల మధ్య చిన్న మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్‌ వస్తున్నా.. నిధుల కొరత.. అరకొర కేటాయింపుల కారణంగా అడుగు ముందుకు పడటం లేదు.. ప్రభుత్వం సైతం మార్కెట్లు విస్తరించాలని, కొత్తగా ఏర్పాటు చేసేందుకు పురపాలికలు ముందుకు రావాలని పేర్కొన్నా.. ఆ దిశలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రధాన కూరగాయల మార్కెట్లు నాలుగు ఉండగా అందులో రెండు రైతు బజార్లే.. మరో రెండింటిలో ప్రధాన కూరగాయల మార్కెట్‌, రాంనగర్‌ కూరగాయల మార్కెట్‌ ఉన్నాయి. పాతబజారులో రోడ్డుపై కూరగాయలు అమ్ముతుండగా, ముకరంపుర ప్రాంతంలో రోడ్డుపైనే విక్రయాలు జరుపుతున్నారు.