కృత్రిమ చందమామల కోసం చైనా సాహసం

బీజింగ్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కృత్రిమ చందమామలతో సూర్యుని వెలుగును స్వీకరించి వెన్నల లాంటి కాంతిని ప్రసారం చేయాలన్న సాహసం చైనా చేయబోతోంది. పెద్దపెద్ద నగరాల్లో వీధిదీపాల ఖర్చు తడిసిమోపెడు కావడంతో అతిపెద్ద లైట్లతో వెలుతురు ఇవ్వాలని చైనా భావిస్తోంది.  ధగధగా వెలిగే చందమామను తెచ్చి నగరాల విూద నిలిపితే సరి అని చైనా ఆలోచించింది. పైగా ఈ కృత్రిమ చందమామలు అసలు చందమామల కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ వెలుగునిస్తాయి. 2020 నాటికి కృత్రిమ చందమామను ఆకాశంలో నిలబెట్టాలని చైనా చూస్తున్నది. నైరుతి ప్రాంతంలోని సిచువాన్‌ రాష్ట్రంలోగల చెంగ్‌డూ నగరంపై తొలి చందమామ వెలుగులు వెదజల్లనున్నది. చంద్రునితో పాటే ఇవీ సూర్యుని కాంతిని సేకరించి నగరాలను కాంతివంతం చేస్తాయి. కాకపోతే చంద్రునికన్నా వీటి కాంతి ఎనిమిది రెట్లు అధికంగా ఉంటుంది. మొట్టమొదటి మానవనిర్మిత చందమామను సిచాంగ్‌ ఉపగ్రహ కేంద్రం నుంచి ప్రయోగిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే 2022లో మరో మూడింటిని ఎగురవేస్తామని చైనా అధికారి ఒకరు చెప్పారు. అంతా సవ్యంగా జరిగితే ఇక వీధిదీపాల అవసరమే ఉండదని ఆయన అంటున్నారు.