కెటిఆర్‌ పిలుపును స్వాగతిస్తున్నాం

ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాల్సిందే: సునీత
యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఈ పథకాలను భారతదేశంలో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రైతుబీమా పథకం ద్వారా మృతి చెందిన రైతు కుటుంబానికి వారం లోపు రూ.5 లక్షల నగదును ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలను బలోపేతం చేసిందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్రంలో ఉన్న
చెరువులన్నింటిని అభివృద్ధి చేసిందన్నారు. ఇన్నికార్యక్రమాలను అమలు చేస్తున్న సిఎం కెసిఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటి కెసిఆర్‌ రుణం తీర్చుకోవాలన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పిలుపు మేరకు ప్రతి కార్యకర్తా ఓ మొక్కనాటి చిత్తశుద్ది చాటాలన్నారు. హరితహారం బలపడాలంటే మొక్కలునాటడంతో పాటు పెంచాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ఆరోగ్య తెలంగాణకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. పేద కుటుంబంలో ఉన్న ఆడ బిడ్డ వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు, మత్స్యకారులకు చేప విత్తనాలు, వాహనాలను అందజేసిందని గుర్తు చేశారు.  అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చేతి పంపులు, తాగునీటి బావులతో పాటు మ రెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. ప్రభుత్వం అందజేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకోలని కోరారు.