కెమేరాల కళ్లుగప్పి ఏటీఎం లూటీ! 

– రూ. 11.50లక్షలు దోపిడీ
– కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పంజాబ్‌, నవంబర్‌11(జ‌నంసాక్షి) : ఏటీఎంలోని సీసీ కెమేరాల కళ్లుగప్పి ఓ ముఠా పెద్దఎత్తున నగదును దోచుకెళ్లింది. ఈ ఘటన పంజాబ్‌ లుథియానాలోని ఖిలా రాయ్‌పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రతా సిబ్బంది ఎవరూ లేని ఏటీఎంను గుర్తించిన దొంగల ముఠా తొలుత ఏటీఎంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన వెంటనే అక్కడి సీసీ కెమెరాల్లో తమ ఆనవాళ్లు రికార్డు కాకుండా దట్టమైన రంగును వాటికి పూశారు. అనంతరం గ్యాస్‌ కట్టర్లను ఉపయోగించి నగదు యంత్రాన్ని తెరిచి అందులోని రూ.11.50 లక్షలను దోచుకెళ్లారు. రోజులానే విధులకు వచ్చిన బ్యాంకు సిబ్బంది దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆరు బయట దట్టమైన మంచు కురవడంతో ఏటీఎం బయట ఉన్న సీసీ కెమెరాల్లో నిందితుల చిత్రాలు రికార్డు కాలేదు. ప్రాథమికంగా నలుగురు సభ్యులు ఉన్న ముఠా ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.