కెసిఆర్‌ నాయకత్వంలో శరవేగంగా అభివృద్ది

కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు నమ్మరు
వారివి అవకాశ రాజకీయాలు: మధుసూధనాచారి
జయశంకర్‌ భూపాలపల్లి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని భూపాలపల్లి నియోజకవర్గ తెరాస అభ్యర్థి, మాజీ స్పీకర్‌
మధుసూదనాచారి కితాబిచ్చారు. సమర్థ నాయకత్వం కేసీఆర్‌ సొంతమని కొనియాడారు. దోపిడీకి మారుపేరుగా కాంగ్రెస్‌ నాయకులు నిలిస్తే.. నిజాయతీకి నిలువుటద్దంగా తెరాస నాయకులు నిలిచారని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థులే లేరని పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు శుక్రవారం చారిని కలసి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారిని టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లిన సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీకే ప్రజల ఆశీర్వాదం ఉంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఖాయమన్నారు. 60ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో చేసి చూపించిందన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. అందరి ఆశీర్వాదంతో మరోసారి విజయం సాధిస్తే ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో భాగస్వాములమవుతూ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల్లో రోజురోజుకూ టీఆర్‌ఎస్‌ పార్టీకి, పుట్ట మధుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ నేతలు ఆసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా తమని ఎదుర్కొనలేక ఓటమి భయంతో కాంగ్రెస్‌ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నా రన్నారు. కాంగ్రెస్‌ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు.  మహా కూటమి ఓ మాయా కూటమని.. అది మాయమయ్యే కూటమని విమర్శించారు. ఆ కూటమికి జెండా గానీ.. ఓ అజెండా గానీ లేదన్నారు. అవసరార్థం ఎన్నికల కోసమే ఏర్పడే కూటముల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. నాయకులంతా కలిసినంత మాత్రాన ఓట్లు రాలవనే సత్యాన్ని మహాకూటమి నేతలు తెలుసుకోవాలని సూచించారు. రూ.2500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని.. ఏడాదిలో 250 రోజులు నియోజకవర్గ ప్రజల మధ్యే ఉన్నానని చెప్పుకొచ్చారు. తాగు, సాగునీరు, రహదారులు, విద్యుత్తు వంటి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించగలిగానని పేర్కొన్నారు. వరదల కారణంగా గ్రామాలు జల దిగ్బంధం కాకుండా ఎక్కడికక్కడ వంతెనలు నిర్మించామని చెప్పారు. ఇంకా అనేక కార్యక్రమలు చేపట్టామని, అవన్నీ ప్రజల సహకారంతో పూర్తి చేస్తామని అన్నారు.