కెసిఆర్‌ పథకాలపై ప్రజల్లో చర్చ

ప్రధానంగా 24 గంటల కరెంట్‌పై ప్రజల్లో ఆసక్తి
రైతుబంధు,రైతు బీమాతో తిరుగులేని అభిమానం
సానుకూల ధోరణికి నిదర్శనమన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి
నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని నల్లగొండ ఎంపి, రైతు సమన్వయ సమితి రాష్ట్రా అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా 24 గంటల కరెంట్‌పై ప్రధానంగా చర్చించు కుంటున్నారని, తరవాత రైతుబంధు, రైతుబీమాపై చర్చ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానానికి ఇదే నిదర్శనమని శనివారం నాడాయన ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని.. చీకట్లు తప్పవని నాటి పాలకులు హెచ్చరికలు చేశారన్నారు. కానీ నేడు కోతలు లేని కరెంటును నిరంతరంగా సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణెళి అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలు, వృద్ధులు, యువకులు తెలంగాణ పథకాలపై చర్చ చేయడంతో పాటు వారే ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలను కొందరు స్వయంగా ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్న తీరు మళ్లీ తమ విజయానికి నాంది కాబోతున్నదని అన్నారు. నాలుగు సంవత్సరాల్లో జరిగిన ప్రగతిని గుర్తించి ప్రజలు ఓటేస్తామని అంటున్నారని వివరించారు.  సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో వరుసగా నిర్వహస్తున్న  బహిరంగ సభలతో నిరూపితమైందన్నారు. వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి ప్రజల గురించి ఇంతలా ఆలోచించలేదని, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నపుడు ప్రజలను మోసం చేశారన్నారు. మరోసారి మాయమాటలు చెబుతూ మభ్య పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, ప్రజలంతా
ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ను ఒక్కడిని ఎలాగైనా ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ సిద్ధాంతాలు, విధానాలను పక్కనపెట్టి ఏకమయ్యాయన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్‌ను ఓడించే దమ్ము ఎవరికీ లేదన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో పేద కుటుంబాలు సంతోషంగా తమ ఆడబిడ్డల పెళ్లి చేస్తున్నారన్నారు. ఇన్ని మంచి పథకాలను తీసుకువచ్చిన కేసీఆర్‌ నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించేందుకు ప్రజలంతా స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నారన్నారు. కేసీఆర్‌ సీఎం అయితే పింఛన్‌ రూ.2016కు పెరుగుతుందని.. నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తారని చెప్పారు. రైతు బంధు కింద ఆర్థిక సాయం రూ.ఎకరాకు 10వేలకు పెరుగుతుందని రైతులు సంబర పడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏకపక్షంగానే ఉండబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న విపక్షాల నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే నైతికత కోల్పోయారన్నారు.