కెసిఆర్‌ ప్రచారం తరవాత పెరిగిన జోష్‌

ఇంటింటి ప్రచారానికి టిఆర్‌ఎస్‌ ప్రాధాన్యం

విస్తృత ప్రచారంలో మంత్రులు,సీనియర్‌ నేతలు

ఆదిలాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధినేత,సిఎం కెసిఆర్‌ జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన తరవాత అభ్యచర్థుల్లో జోష్‌ పెరిగింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపి నగేశ్‌, మాజీ కేంద్రమంత్రి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలాచారిలు జిల్లాను చుట్టి వస్తున్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు విస్తృతంగా ప్రచారం చేపట్టడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లో విస్తృతంగా

పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మంత్రి జోగు రామన్న. ఇంద్రకరణ్‌ రెడ్డిలు కూడా విరామ మెరగకుండా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రచారానికి వస్తున్న టీఆర్‌ఎస్‌ అ భ్యర్థులు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ సంఖ్యలో ప్రచార కార్యక్రమానికి తరలివస్తున్నారు. నాలుగేళ్లులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వివరిస్తూ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మరోసారి తమను ఆశీర్వదించాలని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు అభివృద్ధి నిరోధకులని, కూటమి నేతల మాటలు నమ్మవద్దని నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మహాకూటమి నాయకుల మాటలు నమ్మవద్దని, గ్రామాలకు ప్రచారానికి వస్తే వారు చేసిన అభివృద్ధిపై నిలదీయాలన్నారు. ప్రతిపక్షాల నాయకులు నిజాలను తెలుసుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడకుండా కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. గత పాలకులు రైతులు, పేదల స మస్యలను పట్టించుకోలేదని, ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రతి పక్ష నాయకులను ప్రజలు నిలదీయాలని అన్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు, కులవృత్తులపై ఆధారపడిన వారితో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. ఆయన పలు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్లతో మాట్లాడారు. గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన పనుల గురించి ప్రజలతో చర్చించారు. అటవీ భూముల విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రజలకు న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

మహిళల పెన్షన్ల విషయమై చర్చించారు. బీడీ కార్మికులందరికీ షరతులు లేకుండా పెన్షన్లు అందజేస్తామని, వృద్ధులకు రూ. 57 ఏండ్ల వారికే ఫించన్‌ అందిస్తామని, స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకునేవారికి రూ. 5 లక్షలు అందజేస్తామని హావిూ ఇచ్చారు. గ్రామాల వారీగా సమస్యలను నేరుగా ప్రజలతో మాట్లాడి రాసుకున్న ఆయన ఎన్నికల కోడ్‌ ముగియగానే తానే దగ్గరుండి పనులు చేయిస్తానని హావిూ ఇచ్చారు. ప్రజలు మరోసారి టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మహాకూటమి నాయకుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియ జేయాలని, ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరి కామన్‌ ఎజెండా కేసీఆర్‌ అని, ఓటర్లకు కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.