కెసిఆర్‌ ముందుచూపుతో చెరువులకు జలకళ

ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు అండ
చెరువుల్లో చేపపిల్లను వదిలిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో చెరువులు జలకళను సంతరించు కున్నాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రం లోని మంచినీళ్ల చెరువులో మంగళవారం ఉచిత చేప పిల్లలను వదిలారు. అలాగే తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని పెద్ద చెరువులో ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రహరీ గోడను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో కుల వృత్తులకు ఆర్థిక బరోసా కల్పించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఆయా కులాల ఆర్థిక బలోపేతానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం పాటుపడుతు న్నారని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మత్స్యకారుల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని చెరువులకు పునర్‌వైభవం తీసుకొచ్చామన్నారు. చెరువులపై ఆధారపడ్డ కులాలకు, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముదిరాజ్‌ లకు చెరువులపై హక్కులు కల్పించి ఆ కులాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. సంక్షేమ పథకాలను కొనసాగించిన నాయకుడు కేవలం కేసీఆర్‌ మాత్రమే అని ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గోపి, అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, మత్స్య శాఖ జిల్లా అధికారి నరేష్‌ కుమార్‌, ఎంపీపీ అనిమిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.