కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

హైకోర్టు తీర్పు కాపీని ఇసికి అందచేసిన మర్రి
కెసిఆర్‌ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ నేతలు
న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ల అసెంబ్లీ  సభ్యత్వం రద్దు చెల్లదంటూ  హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. కాంగ్రెస్‌ సినీయర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి నేతృత్వంలో వెంకట్‌ రెడ్డి, సంపత్‌, న్యాయవాది జంధ్యాల శంకర్‌తో కలిసి ఈసీకి తీర్పు కాపీని ఇచ్చారు. రాష్ట్రంలో తెరాస పార్టీ కుట్రలను ఈసీకి వివరించామని.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని ఈసీని కోరినట్లు మర్రి శశిధర్‌ రెడ్డి తెలిపారు. సెక్షన్‌ 150 ప్రకారం ఎమ్మెల్యే స్థానాలు ఖాళీలు లేవని.. ఎన్నికలు నిర్వహించడం లేదని అసెంబ్లీకి లేఖ రాయాలని ఈసీకి చెప్పినట్లు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో హైకోర్టు తీర్పును ఈసీకి నేతలు వినిపించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ, స్పీకర్‌కు సభ్యత్వాన్ని రద్దు చేసి అధికారం లేదని, రాత్రికి రాత్రి సభ్యత్వాలను రద్దు చేసి ఈసీకి పంపారని, అసెంబ్లీ ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ లేఖ రాయాలని ఈసీని కోరినట్లు మర్రి శశిధర్‌ రెడ్డి తెలిపారు. మర్రనితో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఓపీ రావత్‌ను కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వివరించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ…’అక్రమంగా తమ సభ్యత్వాన్ని రద్దు గురించి చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్‌కు వివరించాం. అసెంబ్లీకి, స్పీకర్‌కు సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రి సభ్యత్వాలను రద్దు చేసి, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ కుతంత్రాలను కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం సమాచారన్ని లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. టీఆర్‌ఎస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 15 లక్షలమందిని వివిధ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. కక్ష సాధింపు కోసం సభ్యత్వాలను రద్దు చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు తీసుకు రావాలనే కేసీఆర్‌ చేసిన గుణాత్మక మార్పులు ఇవేనా. నీకు పోటీగా వస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తావా?. హైకోర్టు తీర్పును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. సానుకూలంగా స్పందించింది.’ అని తెలిపారు. గుణాత్మక మార్పు  అంటూ ప్రజలను మబ్యపెడుతున్న సిఎం కెసిఆర్‌ సాధించే గుణాత్మక మార్పు ఇదేనా అని మర్రి ప్రశ్నించారు. నిరంకుశంగా ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేయడం ఎంతవరకు సబబని అన్నారు. ప్రజలకు దీనిపై ఎలాంటి సందేశం ఇవ్వనున్నారని అన్నారు.