కేజీబీవీ టీచర్ల వేతనాలు పెంపునకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):రాష్ట్రంలోని 391 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)ల్లో 6-10 తరగతులకు గదుల నిర్మాణం, బెడ్లు, క్లాస్‌ రూమ్‌ ఫర్నీచర్‌ కోసం రూ.350 కోట్లు అవసరమని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేసింది.  విద్యాశాఖలోని వివిధ శాఖాధిపతులతో నిర్వహించిన సవిూక్షలో వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించారు. గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని మరో 20 స్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు రూ.25 కోట్లు, ప్రస్తుతం ఉన్న 15 జూనియర్‌ కాలేజీల్లో పక్కా భవనాల నిర్మాణం, ప్రయోగశాలలు, గేమ్స్‌ మెటీరియల్స్‌ కోసం రూ.100 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని వర్సిటీల్లో వేతనాలు, భవనాల నవీకరణకు రూ.1000 కోట్ల ప్రతిపాదనకు సీఎం అంగీకరించారని తెలిపారు. మొత్తానికి గత ఏడాది కేటాయించిన రూ.8671 కోట్ల బడ్జెట్‌కు అదనంగా ఈ సారి రూ.2 వేల కోట్లు ప్రతిపాదించినట్లు తెలిసింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల టీచర్ల వేతనాలు పెంచేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. స్పెషల్‌ ఆఫీసర్ల వేతనం రూ.21 వేల నుంచి రూ.31500కు, కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్‌ టీచర్‌ వేతనం రూ.15 వేల నుంచి రూ.22,500కు చేరనుంది. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది.