కేటీఆర్‌ చిల్లర మాటలు మానుకోవాలి

– విూ హయాంలో చేసిన అభివృద్ధేంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది
– కేటీఆర్‌కు సలహా ఇవ్వాలని పవన్‌ను కోరతా
– కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌
హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : మంత్రి కేటీఆర్‌కు పెద్దలంటే గౌరవం లేదని, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వి.హెచ్‌ మాట్లాడారు. కేటీఆర్‌ వాడుతున్న ట్విట్టర్‌ రాజీవ్‌గాంధీ వల్లనే ప్రాచుర్యంలోకి వచ్చిందంటూ వీహెచ్‌ ఎద్దేవాచేశారు. విూ హయాంలో చేసిన అభివృద్ధి ఎంటో వచ్చే 2019 ఎలక్షన్స్‌ లో తెసిపోతుందని దుయ్యబట్టారు. రాహుల్‌ పర్యటనను అడుగడుగునా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని, అయినా రాహుల్‌ పర్యటనను విజయవంతం చేశామంటూ వీహెచ్‌, కేటీఆర్‌కు సమాధానం ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ పర్యటన విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులకు శిక్షణ ఇస్తామని కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తమకు శిక్షణకు అవసరం లేదని, సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీనే కేటీఆర్‌కు శిక్షణ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీనే కేసీఆర్‌కు శిక్షణ ఇచ్చి అంత పెద్ద నేతను తయారు చేసిందని గుర్తు చేశారు. ఇటీవల రాహుల్‌ హైదరాబాద్‌ పర్యటనను విఫలం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని వీహెచ్‌ అన్నారు. చివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లకుండా అనుమతి ఇవ్వకపోవడం
శోచనీయమని పేర్కొన్నారు. కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్న జనసేన అధినేత పవన్‌ను కలుస్తానని వీహెచ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, నేతలపై విరుచుకుపడుతూ అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్‌కు సలహా ఇవ్వాలని ఆయనను కోరతానని విహెచ్‌ తెలిపారు.
————————