కేరళ వరదలకు చలించిన కొరటాల

3లక్షల ఆర్థిక సాయం ప్రకటన

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): కేరళ జలవిలయంతో ప్రతి ఒక్కరూ స్పందించి ముందుకు వస్తున్నారు. నటులు తమవంతుగా సాయం అందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ 25 లక్షల సాయం ప్రకటించారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ 3లక్షల విరాళం ప్రకటించారు. సమాజిక చిత్రాలతో జనాలలో చైతన్యం కలిగించే దర్శకులలో కొరటాల శివ ఒకరు. రచయిగా సినీ కెరీర్‌ ప్రారంభించిన కొరటాల ప్రస్తుతం దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల భరత్‌ అనే నేను చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన కొరటాల సైరా మూవీ తర్వాత చిరుతో క్రేజీ ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. ఈ మూవీ సామాజిక నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. కొద్ది రోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకి ఎందరో నిరాశ్రయులయ్యారు. 168 మంది మృత్యువాత పడ్డారు. ఇళ్ళన్నీ నీళ్ళలో కొట్టుకుపోవడంతో తిండి తప్పలు లేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వారికి తనవంతు సాయంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి కొరటాల మూడు లక్షల విరాళం అందించారు. కేరళ ప్రజల జీవితాలను పునర్నిర్మించడం, అందమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు వారికి సపోర్ట్‌గా నిలబడాలని కొరటాల పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేరళ రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మొత్తం 13 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఒక్క కాసర్‌ఘడ్‌ జిల్లాలో మాత్రం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించలేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కూడా సవిూక్షిస్తుంది.