కేసీఆర్‌ రైతులను ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నారు

– 27న ఛలో అసెంబ్లీకి లక్షలాది మంది తరలిరావాలి

– కేసీఆర్‌ మోసాలను ప్రజల్లో ఎండగడతాం

– ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : పూటకో మోసపూరిత మాటలతో కేసీఆర్‌ రైతులను మోసం చేస్తున్నారని, రైతులను రాజులు చేస్తామని చెబుతూ తెరాస కార్యకర్తలకు పెత్తనం అప్పగిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. భారీ సంఖ్య లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారికి అడ్డుకోవటంతో తీవ్ర తోపులాట జరిగింది. ఒకానొక దశలో పరిస్థితి విషమించే స్థాయికి రావటంతో పోలీసులు ఆందోళన కారులపై లాఠీఛార్జికి దిగారు. దీంతో వారికి అక్కడి నుండి తరిమేశారు. ఈసందర్భంగా కోమరెడ్డితో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోమటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులకు దిగుతుందన్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ భయాందోళనకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలతో రైతుల పంటలు నష్టపోయిన తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోని ప్రభుత్వం వారి తరుపున పోరాడే కాంగ్రెస్‌ నేతలపై ఉక్కుపాదం మోపటం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షాలకు దెబ్బతిన్న రైతుల పంటపొలాలను పరిశీలించి వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 27వ తేదీన ఛలో అసెంబ్లీకి లక్షలాదిగా తరలిరావాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణాలో కేసీఆర్‌ కుటుంబం తప్పా ఎవరు సంతోషంగా లేరని అన్నారాయన. ప్రజలను తాగుబోతులుగా మార్చి… రాష్టాన్ని దోచుకుంటున్నారని ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.