కొడంగల్‌పై టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగులు

రేవంత్‌ అనుచరులను చేర్చుకోవడం ద్వారా దెబ్బకొట్టే యత్నం

ఉప ఎన్నిక వస్తే విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గం నుంచే గులాబీ జెండా జైత్రయాత్ర ప్రారంభమ వుతుందని మంత్రి కెటిఆర్‌ చేసిన ప్రకటన చూస్తుంటే రేవంత్‌కు చెక్‌ పెట్టడానికి టిఆర్‌ఎస్‌ గట్టిగా ప్రయత్నాలు చేపట్టిందని అర్థం అవుతోంది. ఒకవైపు రేవంత్‌ను విమర్శిస్తూనే, మరోవైపు కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అక్రమాలను తెరపైకి తసీఉకుని రావడం ద్వారా కొడంగల్‌లో రేవంత్‌ ప్రస్థానాన్ని ఆదిలోనే దెబ్బతీయాలని గులాబీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొడంగల్‌లో రేవంత్‌ అనుచర గణాన్ని దెబ్బతీయడం ద్వారా ఉప ఎన్నిక వస్తే ఓడించి టిఆర్‌ఎస్‌ ముందుకు సాగాలని చూస్తోంది. అందుకే ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇక్కడి నేతలను విడతల వారీగా గులాబీ దళంలో చేర్చుకుంటూ రేవంత్‌ను మానసికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గానికి ఎన్నిక జరిగితే గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో మంత్రులు, నేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి సమక్షంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రజాప్రతినిధులు భారీసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రులు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుటుంబపాలన గురించి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. నాటి నెహ్రూనుంచి నేటి రాహుల్‌గాంధీ వరకు కాంగ్రెస్‌లో కుటుంబపాలన ఉందన్న విషయం మరచి పోయారా అని ప్రశ్నించారు. ఇకపోతే ఓటుకు నోటు కేసులో రేవంత్‌ తీరును దుయ్యబట్టడం ద్వారా మానసికంగా కూడా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అలాగే ఈ వ్యవహారాన్ని మరోమారు ప్రచారం చేయాలని టిఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే దేశంలో ఓటేసిన కొడంగల్‌ ప్రజల పరువును తీశారని కెటిఆర్‌ దుయ్యబట్టారు. రూ.50 లక్షలతో పట్టుబడి జైల్లో చిప్పకూడు తిన్న గజదొంగ అని, దొంగలను చేర్చుకునే దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్‌కు పట్టిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి సీమాంధ్రబాబు చెప్పు చేతల్లో తొత్తుగా వ్యవహరించారని విమర్శించారు. కోటలు పగులగొడుతా.. బద్దలుకొడుతా అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడని. బద్దలుకొట్టటం కాదు కదా సున్నం కూడా పీకలేడని అన్నారు. రాహుల్‌కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా కేసీఆర్‌ను ఏవిూచేయలేరన్నారు. పాలమూరు కరువు, వలసలకు కాంగ్రెస్‌ కారణమని మరోమారు కేటీఆర్‌ విమర్శించడం ద్వారా కాంగ్రెస్‌ను కూడా టార్గెట్‌ చేశారు. పొతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతుంటే హారతులు పట్టిన చరిత్ర మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ నాయకులదని విమర్శలకు పదను పెట్టారు. అడుగడుగునా తెలంగాణను కాంగ్రెస్‌ దగా చేసిందని విమర్శించారు. 50ఏండ్లలో జరుగని అభివృద్ధి మూడున్నర ఏండ్లలో చేసి చూపించామని కేటీఆర్‌ చెప్పారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి ఏమిచూసి కాంగ్రెస్‌కు పోతున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పౌరుషమని మాట్లాడు తున్న రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పౌరుషం గుర్తుకురాలేదా? అని నిలదీశారు. ఇన్నాళ్లూ ఆంధ్ర నాయకులకు అంకితమై వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు.తెలంగాణ పునర్నిర్మాణం లో భాగస్వాములుకావాలని, సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. దేశానికి, రాష్టాన్రికి పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీ అంటూ మరోమారు ప్రచారం చేపట్టారు. మొత్తంగా కొడంగ్‌ ఉప ఎన్నికను తమకు అనుకూలంగ ఆమలచుకుని అటు రేవంత్‌ను, ఇటు కాంగ్రెస్‌ను ఏకకాలంలో దెబ్బకొట్టాలని చూస్తున్నారు.