కొత్త ఓటర్లలో చైతన్యం కోసం యత్నం

టీఆర్‌ఎస్‌ సమావేశాల్లో ప్రధానంగా దీనిపై దృష్టి
భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొత్త ఓటర్ల నమోదులో ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న జిల్లాలో కొత్తగూడెం మినహా మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వై ఉన్నాయి. రిజర్వుడ్‌ స్థానంగా ఉన్న మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు ఇల్లెందు, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో కీలకపాత్ర పోషించనున్నారు. ఇందుకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన పర్యటనలో కీలకమైన సూచనలు ఇవ్వన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 9,15,872 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి పది వేల మంది పార్లమెంట్‌ నియోజకవర్గాల సమావేశానికి హాజరు కానున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల మంది చొప్పున ఐదు అసెంబ్లీ నియోవర్గాల నుంచి సుమారు పది వేల మంది తరలి వెళ్లేలా కసరత్తు జరుగుతుంది. ఈ నెల 16న ఒకేరోజు ఖమ్మం,
మహబూబాబాద్‌ కేంద్రాల్లో ఈ పార్లమెంటరీ స్థానాల కోసం జరగనున్న సన్నాహక సమావేశానికి సుమారు నాలుగు వేల మంది ఖమ్మం, ఆరు వేల మంది మహబూబాబాద్‌కు తరలి వెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర బాధ్యులు, నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, పార్టీ మండల, ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ పట్టణ అధ్యక్షులు, కార్మిక సంఘాల నాయకులు, మహిళలు, ఇతర నేతలు సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి తరలి వెళ్లనున్నారు.