కొత్త కోర్సులపై చిత్తశుద్ది కరవు

ప్రకటన చేసినా ప్రణాళిక ఏదీ?
నల్లగొండ,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ఎంజీయూలో 2019-20కి నూతన కోర్సులను ప్రారంభిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. అయితే ఆ కోర్సులకు సంబంధించిన డిపార్టుమెంట్స్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో యూనివర్సిటీలో నోటీసు బోర్డుల్లో కాని, తరగతులను కాని కేటాయించలేదని తెలుస్తోంది. మరో వైపు ఆయా విభాగాలకు సంబంధించి పుస్తకాలను సైతం కొనుగోలు చేసిన దాఖలాలు లేవని సమాచారం. కాని ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ప్రైవేటు కళాశాలలో ఈ కోర్సులు
ప్రారంభించాలంటే ముందుగానే ఆ కళాశాల భవనం, తరగతి గదులు, ల్యాబ్స్‌, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది భర్తీ పక్రియ పూర్తి చేయాలి. అదే విధంగా అందుకు సంబంధించిన లైబ్రరీని అన్ని పుస్తకాలతో అందుబాటులో ఉంచాలి. ఆ వివరాలను ఎన్‌సీటీఈ అధికారులకు నివేదించిన తర్వాత వారి అనుమతి వచ్చాక అనుమతిస్తే కోర్సును నిర్వహించాల్సి ఉంటుంది. మరో వైపు ఆయా విభాగాలకు సంబంధించి ఎంజీయులో బోధనా సిబ్బందిని సైతం ఇంకా నియమించలేదు. సిబ్బంది లేకుండా విద్యార్థులు చేరితే తరగతులు ఎలా జరుగుతాయో అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. 2007-08లో ప్రారంభమైన మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌ పీజీ కోర్సుల నిర్వహణకు సిద్ధమైంది. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో ఈ విద్యాసంవత్సరానికి ఐదు నూతన కోర్సులను అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎంఏ తెలుగు, హిస్టరీ అండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌తో పాటు ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులు ఉన్నాయి. వీటిలో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులను ప్రారంభించాలంటే ఎన్‌సీటీఈ అనుమతులు తప్పనిసరి. అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయకుండా కోర్సులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించడం నిర్లక్ష్యం ఎత్తిచూపుతోంది. త్వరలో ప్రారంభమయ్యే కామన్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (సీపీజీఈటీ 2019) రెండో విడుత కౌన్సెలింగ్‌లో ఈ కోర్సును చేర్చనున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలింగ్‌కు సంబంధించిన పక్రియలకు సైతం ఎన్‌సీటీఈ అనుమతులు లేనిది ఉంచబోమని సీపీజీఈటీ కన్వీనర్‌ సైతం వెల్లడించినట్లు సమాచారం.ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల
నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. వర్సిటీ సెనేట్‌, పాలక మండలి సమావేశం సైతం ఆమోదం తెలిపింది. వీటికి తోడు ఎన్‌సీటీఈ అనుమతులు పొందాల్సి ఉండగా.. దరఖాస్తు కూడా చేయలేదు. కోర్సులను అందుబాటులోకి తెస్తున్నప్పుడు వాటికి సంబంధించిన అనుమతులకై ప్రణాళికలు రూపొందించి పూర్తి చేయాల్సిన ఎంజీయూ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నట్లు సమచారం.