కొత్త జిల్లాల్లో ఆర్థిక సమస్యలు

నిధుల కేటాయింపులో జాప్యం
మెదక్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుతో అనేక ఇబ్బందులు ఏర్పడతాయని గతంలోనే బిజెపి నాయకత్వం  తెలిపిందని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు  అన్నారు. కొత్త జిల్లాల్లో ఇప్పుడు సమస్యలు నెలకొన్నాయని, ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయని అన్నారు. పూర్తిస్తాయిలో సిబ్బంది నియామకం జరగలేదన్నారు.  కొత్త జిల్లాలు ఏర్పడితే కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వబోదని.. దానికి సంబంధించిన విషయాలను ఆయా రాష్టాల్రే చూసుకోవాలని అన్నారు. ఇప్పుడు అదే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. పాలన ఒక దగ్గర ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు మరోచోట ఉన్నాయని చెప్పారు. ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో సమస్యలపై ఉద్యమించడం నేరంగా మారిందని ఆయన మండిపడ్డారు. వివిధ పోరాటాలు చేసి సాధించిన సొంత రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యమ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని  తెలంగాణ ఉద్యమంలో విధ్వంసాలు, హింసలు చేలరేగినా.. గత పాలకులు ఉద్యమ నేతలను జైలుపాలు చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ గత మూడేళ్ల నుంచి ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, రైతులు దేనిపైనైనా ఉద్యమిస్తే జైలుకు పంపుతున్న సంఘటనలు చూస్తున్నామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరసనలు తెలిపేవారి గొంతు నొక్కడమే పనిగా పెట్టు కుందన్నారు.