కొత్త పంచాయితీలతో పెరగనున్న సర్పంచ్‌ల సంఖ్య

కొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఎంపికపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేస్తున్న నేపథ్యలంఓ వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల కు అనుగుణంగా ప్రత్యేక పద్దతిలో కొత్త పంచాయతీల ఏర్పాటుపై వివరాలు రూపొందిస్తున్నారు. గ్రావిూణ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వం సంకల్పానికి అనగుణంగా ప్రస్తుతం ఉన్న పంచాయతీల పరిధిలోని తండాలను, గూడాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణకు ఆదేశించింది. గతంలో 137 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదింప జేస్తే ఇవన్నీ సాకారం కానున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు కేటాయించడమే కాకుండా అనుకున్న సమయానికే ఎన్నికలు నిర్వహించేలా చేస్తున్నారు. గ్రామాల్లో సమస్యల సత్వర పరిష్కారంతో పాటు పంచాయతీలు వేదికగా అన్ని సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పించడంతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు కుల, ఆధాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను కూడా ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామ పంచాయతీల్లోనే పొందే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి రానున్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుతో ప్రజల ముంగిట్లోకి ఊహించని రీతిలో పరిపాలనా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తపంచాయతీల సంఖ్యపై పూర్తి వివరాలు అధికారికంగా ధ్రువపడాల్సి ఉంది. దీంతో జిల్లా జాబితాలో అదనంగా కొన్ని పంచాయతీలు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చేస్తున్న కసరత్తు ఆధారంగా పంచాయతీల సంఖ్య 200లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 205 పంచాయతీలకు తోడు అధనంగా మరో 200లకు పైగా కొత్త పంచాయతీలు ఏర్పాటైతే పరిపాలనా సౌలభ్యంతో పాటు వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలు అభివృద్ది చెందడంతో పాటు కొత్తగా అనేక మందికి సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లు అయ్యే అవకాశాలు కూడా లభించనున్నాయి. దీంతో అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటు కసరత్తు కొనసాగుతోంది. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, ఈవోలు, ఈవోఆర్డీలు పంచాయతీల జనాభా లెక్కలు, శివారు గ్రామాల వివరాలతో కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 205 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ పంచాయతీ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలను మూడు కిలోవిూటర్ల పరిధిలో ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని 500 మందికి పైగా జనాభా ఉన్న 750 లోపు టార్గెట్‌గా నిర్ణయించారు.