కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసిన ఆర్‌బిఐ

పాతవీ చెల్లుబాటవుతాయని ప్రకటన

న్యూఢిల్లీ,జూలై19(కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసిన ఆర్‌బిఐ): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త వంద నోట్లను విడుదల చేసింది. మహాత్మాగాంధీ న్యూ సిరీస్‌లో ఈ కొత్త వంద నోట్లు వచ్చాయి. లావెండర్‌ కలర్‌లో దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కొత్త నోటు ఉంది. గుజరాత్‌లోని చారిత్రక కట్టడం రాణి కీ వావ్‌ను ఈ నోటు వెనుకాల ముద్రించారు. కొత్త నోట్లు వచ్చినా ఇప్పుడున్న వంద నోట్లు కూడా చెలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టంచేసింది. ఈ కొత్త నోట్లు మెల్లగా బ్యాంకింగ్‌ వ్యవస్థను సామాన్య ప్రజానీకానికి చేరనున్నాయి. ఈ నోటుపై 100ను దేవనాగరి లిపిలోనూ ముద్రించారు. నోటు మధ్యలో గాంధీ బొమ్మ ఉంటుంది. ఇక ఆర్బీఐ, హిందీలో భారత్‌ అని, ఇండియా, 100 అనే మైక్రో పదాలు కూడా ఉంటాయి. నోట మధ్యలో ఉన్న సెక్యూరిటీ థ్రెడ్‌పై కూడా హిందీలో భారత్‌, ఆర్బీఐ అన్న అక్షరాలు ఉంటాయి. నోటును మడిచినప్పుడల్లా థ్రెడ్‌ కలర్‌ ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది.