కోట్లకు పడగలెత్తుతున్న ఇసుకాసురులు

అధికారుల కళ్లుకప్పి రహస్యంగా రవాణా
ఆదిలాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో ఇసుక కొరత అధికంగా ఉంది. ఇదే అదనుగా కొందరు అక్రమ వ్యాపారానికి తెరతీసారు. కొందరు దళారులుగా అవతారమెత్తి ఆదిలాబాద్‌ సరిహద్దు ప్రాంతాలు, గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లా కేంద్రానికి లారీల్లో ఇసుక తరిలివస్తుంది. జాతీయ రహదారి పై చెక్‌పోస్టులు ఉండటంతో ఇతర మార్గాల ద్వారా వాహనాల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.ఈ అక్రమ దందాతో దళారులు లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పెన్‌గంగా నదితో పాటు జైనథ్‌ మండలంలోని సాత్నాల వాగుకు ఇరువైపులా ఉన్న తర్ణం, తరోడ, పుసాయి, పెండల్‌వాడ గ్రామాల నుంచి అక్రమంగా ఇసకను తరిలిస్తారు. జి భీంపూర్‌, తాంసి మండలం పెన్‌గంగ సరిహద్దు గ్రామాలు , బేల మండలం సాంగిడి ప్రాంతం నుంచి ఇసుక అధికంగా రవాణా అవుతోంది. ఇసుకను అక్రమంగా తరలించడంతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో కాకుండా లారీలు, ట్రాక్టర్లలో రాత్రివేళల్లో ఎక్కువగా రవాణా చేయడం వల్ల రోడ్లు పాడయి పోతున్నాయి.  రెవెన్యూ, భూగర్భ శాఖల అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించకపోవడంతో భారీగా రవాణా అవుతుంది.  గతేడాది వానాకాలంలో కురిసిన వర్షాల కారణంగా వరదలు పారడంతో నదీ పరివాహాక ప్రాంతాలు కాలువల్లో ఇసుక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఫలితంగా జైనథ్‌, భీంపూర్‌, తాంసి, బేల మండలాల్లోని నదీపరివాహక ప్రాంతాలు, కాలువల్లో ఇసుక నిల్వలు ఎక్కువగా పేరుకు పోయాయి. ఇసుక ఆదిలాబాద్‌ పట్టణానికి సవిూపంలో ఉండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు.