కోట్లాదిమంది మదిలో బాలు చిరస్మరణీయులు

తొలి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రముఖులు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); తన గానంతో కోట్లాది శ్రోతలని పరవశింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం మరణించి అప్పుడే ఏడాది అయ్యింది. గతేడాది సెప్టెంబర్‌ 25న ఆయన కరోనా చికిత్స తీసుకుంటూ మృత్యువాత పడ్డారు. ఆయన తొలి వర్ధంతి సందర్భంగా ఎస్పీ బాలుకు సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. బాలు పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ఆయితే అందరికీ ఆయన బాలుగా సుపరిచితుడు. పాటలు పాడడమే కాక సంగీత దర్శకత్వం కూడా వహించిన ఆయన నిర్మాతగాను తన సత్తా చూపించారు. మిథునం ఆయనకు నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చింది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా బాలు పని చేశారు. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రధానంగా ఆయన పాటలు వినిపిస్తాయి. మొత్తంగా చూస్తే 16కుపైగా భాషల్లో ఆయన పాటలు పాడారు. 40,000కుపైగా పాటలు పాడి ఆయన గిన్నిస్‌ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆయన కెరీర్‌ అప్రతిహాతంగా సాగుతున్న వేళ బాలుకి కరోనా సోకింది.ఆగస్ట్‌ 5, 2020న తనకు కరోనా సోకిందని చెప్పిన బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బాలు ఇక మన మధ్య లేడనే వార్తని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. నీవు లేకపో యినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు బరువైన గుండెతో కన్నీటి వీడ్కోలు పలికారు. బాలు మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తూ బాలు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు.