కోట్ల రూపాయల దేవాదాయ భూములు అన్యాక్రాంతం

ఉత్సవ విగ్రహాల్లా ఎండోమెంట్‌ అధికారులు

రైతుబంధు కింద లబ్ది పొందుతున్న అక్రమార్కులు

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): దేవాదాయశాఖ భూముల అన్యాక్రాంతంపై ప్రకనటలు తప్ప పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఆలయ భూములు అన్యాక్రాంతం అయినా,ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కరువైనా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు పలు జిల్లాల్లో ఆక్రమిత భూములకు పట్టలాలు పొంది రైతుబందు ద్వారా డబ్బులు కూడా జమచేసుకున్నారు. జిల్లా ఎండోమెంట్‌ అధికారులు కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్లడం లేదు. అసిస్టెంట్‌ కమిషనర్లు ఉత్సవ విగ్రహాల్లో ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయల విలువైన భూములను కాపాడే క్రమంలో కనీసం ఒక్క ఎకరా కూడా స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. భూముల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తామని, వాటిని స్వాధీనం చేసుకుంటామని సిఎం కెసిఆర్‌ ప్రకటించినా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా శాఖ వ్యవహరించడం లేదు. దీనిపై వార్తలు వస్తున్నా కనీసం వాటి ఆధారంగా భూములను స్వాధీనం చేసుకుని దేవాలయాలను పరిరక్షించడం లేదు. గ్రామాల్లో మాన్యాలను మింగేసిన ఘనులను పట్టించుకోవడం లేదు. అలాగే వాటిని బలవంతంగ ఆపట్టాలు చేయించుకున్న వారు ఇప్పుడు రైతుబంధులో ఎకరాకు 8వేలు పొందారు. దీనిపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఉన్నా తమకు ఎందుకు లే అన్న ధోరణిలో ఉన్నారు. గుడుల పేరుతో ఉన్న ఆస్తులను కొందరు అక్రమార్కులు గుటకాయ స్వాహా చేస్తున్నారు. దేవుడి భూములను అందినంత ఆక్రమించుకోవడంతో నిత్య కైంకర్యాలకు నోచుకోని

పరిస్థితి నెలకొంది. ప్రస్తుత జనగామ జిల్లా బచ్చన్నపేట మండం కేంద్రంలో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం అయినా వాటి గురించి ఫిర్యాదులు ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు చేరినా పట్టించుకోవడం లేదు. దీంతో వందల ఏళ్లనాటి ఆలయం ధూపదీపనైవేద్యానికి నోచుకోవడం లేదు. అలాగే పూజారి లేకున్నా గ్రామ సర్పంచ్‌, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా చూసీచూడనట్లు ఉన్నారు. దాదాపు వంద ఎకరాల వరకు అన్యాక్రాంతం అయ్యాయి. వాటి విలువ ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఎంతలేదన్నా రు. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిజానికి జిల్లాల ఎండోమెంట్‌ అధికారులు ఆలయాల గురించి వివరాలు సేకరించి భూముల స్వాధీనానికి ప్రయత్నించడం లేదు. సిఎం కెసిఆర్‌ దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని దేవాదాయ భూములతో నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. అన్యాక్రాంత భూములను స్వాధీనం చేసుకుని ఆలయాల ఆదాయన్ని పటిష్టం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇలా బచ్చన్నపేట మండలంలో అనేక భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఇకపోతే నల్లగొండ జిల్లామునగాల మండలంలో సుమారు రూ.20కోట్ల విలువైన 200 ఎకరాల ఆలయ భూములు ఆక్రమణకు గురైనా కనీసం పట్టించుకొనే నాథుడే కరవయ్యారు. ఫలితంగా ఉత్సవాల నిర్వహణ సమయంలో దాతలను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రైతుకు కారుకు ఎకరాకు రూ.50 వేల వరకు ఆదాయం వస్తున్నా దేవునికి మాత్రం కౌలు చెల్లించకపోవడం శోచనీయం. గతంలో వచ్చే ఆదాయంతో ఉత్సవాలు, నిత్య నైవేద్యాలకు లోటు ఉండేది కాదు. అనంతర కాలంలో ఆయా కులాల వారికి ఇచ్చిన భూములను కొందరు విక్రయించుకున్నారు. ఆలయాల పేరుతో ఉన్న భూములు మాత్రం అలాగే ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్ను పడింది. ఎవరికి వారు అందినంత ఆక్రమించుకుని యథేచ్ఛగా సాగు చేసుకొంటూ, కనీసం కౌలు కూడా చల్లించడం లేదు. ప్రస్తుతం పేరుకే దేవుని పేరుతో పట్టాలుంటాయి. అవి మాత్రం ఆక్రమణదారుల చేతిలో ఉన్నాయి. ఇలా వందల ఎకరాల దేవాలయ భూములు వారి చేతుల్లో ఉన్నప్పటికీ

అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి కౌలు చెల్లించే విధంగా వేలం కూడా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా అర్చకులకు సైతం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. ఈ భూముల్లో పత్తి, మిర్చి, కంది, వరి పంటలు సాగు చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం పొందుతున్నా కౌలు ఇచ్చేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పడడంతో ఈ భూముల ధర ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఎకరాకురూ.10లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటున్నా అధికారులు స్పదించకపోవడం గమనార్హం. ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుద్దెడ, ముస్త్యాల గ్రామాల్లో కూడా ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.