కోడి రామకృష్ణ ఇక లేరు

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం.. తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. ఆయన మృతితో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగింది.  పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలి భిన్నమని అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలను చూస్తే తెలుస్తుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 2016లో కన్నడ చిత్రమైన ‘నాగహారవు’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా.

చిరంజీవికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు లాంటి బ్లాక్‌​బస్టర్‌ హిట్‌లు అందించిన కోడి రామకృష్ణను పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి.  ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు. సుమన్‌, అర్జున్‌, భానుచందర్‌లాంటి హీరోలను తెరకు పరిచయం చేశారు. మధ్య తరగతి కుటుంబాల నేపథ్యాన్ని ఆధారంగా ఆయన అనేక చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగానే కాకుండా.. నటుడిగాను మెప్పించారు. ఆయన దర్శకత్వంలో చివరగా వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం అరుంధతి. అద్భుత గ్రాఫిక్స్‌ మాయాజాలంతో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులు సృష్టించింది.

ఆకుపచ్చని ఫైల్‌లో అందమైన జ్ఞాపకాలు
హీరో కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతూ..

హైదరాబాద్‌: తొలిప్రేమ, తొలి ముద్దు, తొలి పారితోషికం.. ఇలా ‘తొలి’లో ఉండే మజానే వేరు. అవి ఎప్పటికీ మధురమైన జ్ఞాపకాలే. అయితే ఇప్పుడున్న బిజీ వాతావరణంలో గతాన్ని గుర్తు పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. లేకపోతే బయట చెత్తలో పారేయడమో చేస్తుంటారు. కానీ, కొంత మంది మాత్రం ఆ జ్ఞాపకాలకు కాసిన్ని నీళ్లు పోసి, ఆ పచ్చదనం, పచ్చిదనం వాడిపోకుండా చూస్తూ మురిసిపోతుంటారు. అలా తొలినాటి జ్ఞాపకాలతో నిత్యం రీఛార్జ్‌ అయ్యే వ్యక్తి కోడి రామకృష్ణ. ఆయన ఇంట్లోకి వెళ్తే రకరకాల షీల్డులు, ఫొటోలు లామినేషన్లు కనిపిస్తాయి. ఇక ఆయన పర్సనల్‌ రూమ్‌లో బీరువా నిండా రకరకాల ఫైల్స్‌, ఆల్బమ్స్‌, సినిమా స్క్రిప్టులు. ఏది ఎక్కడ ఉందో ఆయనకు బాగా గుర్తు.

బీరువా పై అరలో ఓ ఆకు పచ్చని ఫైల్‌ కనిపిస్తుంది. ఆ ఫైల్‌ అంటే కోడి రామకృష్ణకు ఆరో ప్రాణం. ఆయన తొలినాటి జ్ఞాపకాలన్నీ అందులోనే సజీవంగా ఉన్నాయి. ఒక్కసారి ఆ ఫైల్‌ ఓపెన్‌ చేసి చూస్తే కొంచెం శిథిలావస్థలో ఉన్న ఓ పత్రిక కనిపిస్తుంది. 1965 సెప్టెంబరు నాటి ‘సత్య సువార్త’ అనే క్రైస్తవ మాస పత్రిక అది. ఆ ముఖ చిత్రం వేసింది కోడి రామకృష్ణ. అవును.. ఆయనలో మంచి ఆర్టిస్టు కూడా ఉన్నారు. చిన్నప్పట్నుంచీ రకరకాల బొమ్మలు వేయడం ఆయనకు హాబీ. ఆ మ్యాగజైన్‌ చూడగానే కోడి రామకృష్ణ ముఖం వెలిగి పోతుందట.

ఇక ఆ ఫైల్‌లోని మరో అందమైన జ్ఞాపకం. రెండు పేజీల ఉత్తరం. 1972 ఫిబ్రవరి 18న ప్రసిద్ధ హాస్య నటులు అల్లు రామలింగయ్య స్వదస్తూరితో రాసిన ఉత్తరమది. అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ.. ఇద్దరిదీ పాలకొల్లు. కొంత కుటుంబ పరిచయం కూడా ఉంది. అప్పట్లో కోడి రామకృష్ణకు సినిమా హీరో కావాలని ఉండేది. అందుకే హీరో కావాలన్న తన ఆకాంక్షను వెలిబుచ్చుతూ కొన్ని ఫొటోలు దిగి మద్రాసులో ఉంటున్న అల్లు వారికి పంపించారు. ఆ ఫొటోలు చూసి అల్లు బదులు కూడా ఇచ్చారు. ‘నీ ఫొటోలు బాగున్నాయి. తప్పకుండా అభివృద్ధిలోకి వస్తావు. అయితే నువ్వింకా చిన్న కుర్రాడివి. లేతగా కనిపిస్తున్నావ్‌. కొంచెం పెరిగాక వచ్చి కలువు‌. ఏ దురభ్యాసాల జోలికీ వెళ్లకుండా ఆరోగ్యం కాపాడుకో..’ ఇది అల్లు వారి ఉత్తరం సారాంశం. ‘ఈ ఉత్తరం చదువుతుంటే అల్లు రామలింగయ్య గారు నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది’ అని విప్పారిన కళ్లతో ఓ సందర్భంలో చెప్పారు కోడి రామకృష్ణ.

ఈ ఫైల్‌లో దీంతోపాటు ఇంకో కీలకమైన ఉత్తరం కూడా ఉంది. అది దర్శకరత్న దాసరి నారాయణరావు రాసిన ఉత్తరం. ‘నా జీవిత గమనాన్ని మార్చిన ఉత్తరమది’ అంటూ చాలా తన్మయత్వంగా ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకునేవారు కోడి రామకృష్ణ. చిత్ర పరిశ్రమకు రావాలనే తన ఆకాంక్షను వెలిబుచ్చుతూ దాసరికి కోడి ఉత్తరం రాశారు. దానికి దాసరి ‘సమయం చూసుకుని నేనే కబురు చేస్తా. అప్పుడు వద్దువుగానీ’ అంటూ 1974 ఫిబ్రవరి 21న బదులిచ్చారు. ఆ తర్వాత దాసరి కబురు చేయడం, ఆయన దగ్గరే 17 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేయడం.. అదంతా ఓ అధ్యాయం. ‘మా గురువు గారితో నాకెన్నో తీపి జ్ఞాపకాలున్నాయి. ఆయన రాత్రంతా కూర్చుని స్క్రిప్టులు రాసిన సందర్భాలు కోకొల్లలు. ‘స్వర్గం-నరకం’ స్క్రిప్టు అలా ఒక్కరాత్రిలో రాసిందే. నా రైటింగ్‌ బాగుంటుంది కాబట్టి, వాటిని నేను ఫెయిర్‌ చేసేవాణ్ని. ఆ ‘స్వర్గం-నరకం’ స్క్రిప్టు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది’ అంటూ ఆ జ్ఞాపకాలను తలచుకుని మురిసిపోయేవారు కోడి రామకృష్ణ.

 తెలుగు సినీ పరిశ్రమలో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన అతికొద్ది మంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. కుటుంబ కథలను, ఫాంటసీ కథలను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాటకాలతో తన కెరీర్‌ను ప్రారంభించిన కోడి రామకృష్ణ దర్శకుడిగా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. అసాధారణ కథలకు, అద్భుతమైన గ్రాఫ్రిక్స్‌ జోడించి ప్రేక్షకులను అలరించడంతో కోడిరామకృష్ణది ప్రత్యేకశైలి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాటకాలతో కెరీర్‌ప్రారంభం..
రామకృష్ణకు చిన్నతనం నుంచే నాటకాల పట్ల చాలా ఆసక్తి ఉండేది. పాఠశాల రోజుల నుంచీ చదువుతో పాటు నాటకాలు ఆడేవారు. కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని నటించేందుకు రప్పించేవారు. తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మేనరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకుతగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు. తన కళాశాల ప్రిన్సిపాల్‌తో ఇచ్చే ఉపన్యాస కార్యక్రమాలకు ఆయనతో కలిసి వెళ్లేవారు. అయితే, ఉపన్యాసం ప్రారంభానికి ముందు ‘సుడిగుండాలు’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కోర్టులో వాదించే సన్నివేశాన్ని ఏక పాత్రాభినయం చేసేవారు.

సినిమా రంగంవైపు అడుగులు..
దాసరి నారాయణరావు తొలిచిత్రం ‘తాత మనవడు’ చూశాక రామకృష్ణకు దర్శకత్వ శాఖలో పని చేయాలని సంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్ధశతదినోత్సవం పాలకొల్లులోని మారుతీ టాకీస్‌లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడగాలనుకున్నారు. అయితే, అనుకోకుండా ఆ కార్యక్రమం రసాభాస కావడంతో నిర్మాత రాఘవ, దర్శకుడు దాసరి నారాయణరావులకు రామకృష్ణ క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం ‘పల్లెపడుచు’ నాటకాన్ని ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు. దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకూ దర్శకత్వ శాఖలో పనిచేశారు.

దర్శకునిగా తొలి చిత్రం చిరుతోనే!
కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన ‘తరంగిణి’ సినిమానే తొలి చిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ‘ఇంట్లో రామయ్య’తో దర్శకుడయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు.

చిరుతో ఆరు చిత్రాలు..
తొలి చిత్రం చిరంజీవితో ‘ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య’ తీసిన కోడి రామకృష్ణ తన కెరీర్‌లో మొత్తం ఆరు సినిమాలకు చిరుతో పనిచేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ‘ఇంట్లో రామయ్య’ షూటింగ్‌ పాలకొల్లు పక్కనే ఉన్న కోడూరులో ప్రారంభించారు. చిరు షూటింగ్‌కు రావడం ఆలస్యం కావడంతో పూర్ణిమపై తొలి షాట్‌ తీశారు. అయితే, కెమెరాకు బ్యాటరీ పెట్టడం మర్చిపోయారు. తొలి షాట్‌ ఇలా అయ్యిందేంటి? అని దిగులుగా కూర్చొన్న కోడి రామకృష్ణ దగ్గరకు చిరు వచ్చి ‘ఫస్ట్‌ షాట్‌ నాపై తీస్తానన్నారుగా. పదండి మొదలు పెడదాం. ఇలాంటి సెంటిమెంట్‌లు పట్టించుకోకూడదు’ అన్నారు. ఆ సినిమాలో ఓ పాట తీస్తున్నప్పుడు ‘ఈ నారింజ పండు విసురుతా. నోటితో పట్టుకుంటే సినిమా హిట్‌’ అని చిరు తమాషా చేయడంతో అలాగే దాన్ని నోటితో పట్టుకున్నారు కోడిరామకృష్ణ. ఆ తర్వాత  ‘ఆలయశిఖరం’, ‘సింహపురి సింహం’, ‘గూఢచారి నెం.1’, ‘రిక్షావోడు’, ‘అంజి’ చిత్రాలు తెరకెక్కించారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. తర్వాత బాలకృష్ణతో ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ముద్దులమావయ్య’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘బాలగోపాలుడు’ వంటి చిత్రాలు తీశారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో తీసిన ‘అమ్మోరు’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘దేవి’, ‘దేవీ పుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

నటుడిగానూ తనదైన ముద్ర!
దర్శకత్వం చేయాలన్న ఆలోచన రాకముందు రామకృష్ణ నటుడిగానూ ప్రయత్నాలు చేశారు. దర్శకత్వ శాఖలో పనిచేయడానికి ముందే డిగ్రీ విద్యార్థిగా ఉండగానే ‘రాధమ్మ పెళ్లి’ చిత్రంలో దాసరి నారాయణరావు ఆయనకు కథానాయికకు అసిస్టెంటుగా ఓ పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ప్యాచ్ వర్క్ ఎవరో డూప్‌తో జరుగుతుండగా, అప్పుడే కోడి రామకృష్ణ మద్రాసు రావడంతో ఆయనకే మేకప్ వేసి నటింపజేశారు. దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాల్లో చిన్నాపెద్దా పాత్రల్లో నటిస్తూండేవారు. ‘స్వర్గం నరకం’లో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా మెప్పించారు. ‘ఎవరికి వారే యమునా తీరే’ వంటి చిత్రాల్లోనూ నటించారు. దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా ‘మా ఇంటికి రండి’ అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఐతే చిత్రం విజయవంతం కాలేదు. తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’ సినిమాలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

కోడి రామకృష్ణ హెడ్‌ ‌బ్యాండ్‌ వెనుక కథ!
 కోడి రామకృష్ణ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన తలకు కట్టుకునే క్లాత్‌. ఆయన తలకు క్లాత్‌ కట్టుకోవడం వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అది ఆయనకు చాలా సెంటిమెంట్ అట. ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ‘నా రెండో సినిమా షూటింగ్‌ కోవలం బీచ్‌ దగ్గర జరుగుతోంది. మిట్ట మధ్యాహ్నం ఎన్టీ రామారావు కాస్ట్యూమర్‌ మోకా రామారావు సెట్‌కు వచ్చారు. ‘మీ నుదురు విశాలంగా ఉంది. ఎండకి ఎక్స్‌పోజ్‌ అవుతోంది’ అంటూ తన జేబులోని రుమాలు తీసి ఇచ్చి కట్టుకోమన్నారు. ఆయన చెప్పారు కదాని రోజంతా ఆ రుమాలును తలకు కట్టుకున్నా. మరుసటి రోజు ఆ రుమాలును బ్యాండ్‌లా తయారుచేసి తీసుకొచ్చారు. ‘ఈ బ్యాండ్‌కు మీకు ఏదో అనుబంధం ఉందండి. ఇది అందరికీ నప్పదు. మీకు బాగా సూటైంది. దీన్ని కట్టుకోకుండా ఉండొద్దు’ అన్నారు.

అప్పటినుంచి షూటింగ్ సమయంలో బ్యాండ్‌ కట్టుకోవడం సెంటిమెంట్‌గా అయిపోయింది. నా గుర్తింపుగా మారిపోయింది. పోలీసులకు టోపి, రైతుకు తలపాగా ఎలాగో నాకు ఈ బ్యాండ్‌ అలా అన్నమాట. దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను. ఓ రోజు కె.బాలచందర్‌ మా సెట్‌కు వచ్చారు. అప్పుడు నేను తలకు పూలతో ప్రింట్‌ చేసున్న బ్యాండ్‌ కట్టుకున్నా. అది చూసి ‘ఆగాగు’ అన్నారు. ఎందుకంటే నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలింది. దాన్ని చూసి ‘ఈ బ్యాండ్‌కు నీకు ఏదో అనుబంధం ఉంది. ఎంజాయ్ చెయ్’ అంటూ ఆశీర్వదించారు’ అని వెల్లడించారు కోడి రామకృష్ణ.