కోదండరామ్‌ను విమర్శిస్తే ఓట్లు రాలుతాయా?

తెలంగాణ ఎన్నికల ముఖచిత్రంలో ఇప్పుడు పరస్పర విమర్శల కారణంగా అసలు సమస్యలు వెనక్కి పోయాయి. ప్రజల సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తామని గట్టిగా చెప్పడంలో అటు అధికార టిఆర్‌ఎస్‌, ఇటు కూటమి నేతలు విఫలం అవుతున్నారు. పరస్పర దూషణలతో తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించు కోవాలని చూస్తున్నారు. కూటమిలో కోదండరామ్‌ పాత్ర కీలకమని తేలడంతో ఇప్పుడు ఆయనను లక్ష్యంగా చేసుకని అధికార టిఆర్‌ఎస్‌ విమర్శలను ఎత్తుకుంది. అదే సమయంలో కోదండరామ్‌ను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో, ఉద్యమ కారులను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో చెప్పడం లేదు. హుజూర్‌ నగర్‌ కోసం అమరుడు శ్రీకాంతాచారి తల్లి ఆవేదన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. ఆమెను పిలిపించి మాట్లాడే సాహసం చేయడం లేదు. స్వీయ అస్థిత్వం, స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే.. దానిని హైజాక్‌ చేసిందెవరో ప్రజలకు తెలియదా? ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు కూటమి ముసుగులో వలసాంధ్ర పాలకులను తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అంటున్న దాంట్లో అర్థం ఉందా? టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన కోదండరాం.. ఇప్పుడు ఆ పార్టీ ఉన్న కూటమిలో ఎలా చేరుతారని హరీశ్‌ ప్రశ్నిస్తున్నారు. అమరావతికి, ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్న కోదండరాం దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నాడు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్‌ గౌరవంగా కోదండరాంను పిలిచి జేఏసీ చైర్మన్‌చేస్తే చివరికి ఆయన పంగనామాలు పెట్టాడని విమర్శించారు. నిజానికి కోదండరామ్‌ను దూరం పెట్టి పంగనామాలు పెట్టిందే టిఆర్‌ఎస్‌ నేతలు. ఆయనను చాలా చులకనగా, హేళనగా చూశారు. ఈ దశలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆయన పార్టీని పెట్టి కెసిఆర్‌ను గద్దెదించాలని ముందుకు వస్తున్నారు. ఈ దశలో కోదండరామ్‌ను తిట్టడం మినహా టిఆర్‌ఎస్‌ చేయగలిగిందేవిూ లేదు. తాము చేసిన పనులతో ఫలాన ప్రాంతం బాగయ్యిందని చెప్పుకోవడానికి వారికి ఛాన్స్‌ లేదు. ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ను ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్‌కే కట్టబెట్టారు. దీనిని కాదనగలరేమో చెప్పాలి. నాలుగేళ్లుగా అధికరాంలో ఉన్నా కాంగ్రెస్‌,టిడిపిలు అభివృద్దికి అడ్డం పడుతున్నాయన్న సొల్లు కబుర్లే వినిపిస్తున్నాయి. ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి సింహంలాంటి సీఎం కావాల్నా.. ఢిల్లీకి గులాం గిరీచేసే సీల్డుకవర్‌ సీఎం కావాలా అంటూ మరోవైపు కెటిఆర్‌ సవాళ్లు విసరుతున్నారు. వివిధ పార్టీల నుంచి క్షేత్రస్థాయిలో కొందరిని చేర్చుకోవడం ద్వారా పరిస్థితి అంతా తమకే అనుకూలమన్న లెవల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అధికార పార్టీ పత్రికలు, విూడియా అదేపనిగా ప్రచారం చేస్తూ వాపును బలుపుగా చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ విూడియా ఇంతగా దిగజారిన దాఖలాలు లేవు. కెసిఆర్‌ సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదన్న విషయంపై కూడా స్పష్టమైన సమాధానం రాదు. పోనీ సమస్యలపై ప్రస్తావిస్తే దాటవేతలు లేదా విమర్శలు ఎక్కువయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డది మొదలు ప్రజల పక్షాలన నిలిచి పనులు చేసుకుంటూ పోతే ఇవాళ టిఆర్‌ఎస్‌ ఇంతగా ఇతర పార్టీలను విమర్శించాల్సిన అవసరం ఏర్పడేది కాదు. అలాగే 9 నెలల ముందే ఎందుకు అసెంబ్లీ రద్దు చేయాల్సి వచ్చిందీ సమాధానం లేదు. అసలా అవసరం ఎందున్న దానికి కూడా జావాబు రావడం లేదు. ప్రజలను పట్టించుకుని ఉంటే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన నేతగా కెసిఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలాగే ఆ పార్టీని ప్రజలు విస్మరించేవారూ కాదు. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇంకా కాంగ్రెస్‌,టిడిపి, బిజెపిలను తిడుతూ, సెంటిమెంట్‌ను రెచ్చగొడితే ఓట్లు రాలే

పరిస్థితి ఇప్పుడు లేదు. ఆరుదశాబ్దాల వివక్ష కారణంగా దెబ్బతిన్న తెలంగాణ ప్రాంతానికి నూతన దిశానిర్దేశం చేయడానికి, చరిత్రలో ఒక విశిష్ట నాయకుడిగా నిలవడానికి వచ్చిన అవకాశాలను కెసిఆర్‌ తనకు తానుగా చేజార్చుకున్నారు. ఎందరో బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా, ఆ విజయం తనదేనని కెసిఆర్‌ అన్నా ఎవరుకూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఒక ఆశయం కోసం సుదీర్ఘపోరాటం జరిపి, దాని విజయాన్ని ప్రజలకు అందించిన ఘనుడు కెసిఆర్‌ అనడంలో సందేహం లేదు. అయితే సిఎం అయిన తరవాత అధికారాన్ని సంఖ్యాబలాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజలకు పింఛన్లు, తాయిలాలు ఇస్తూ సాదాసీదా నాయకుడిగా మిగిలిపోయారు. ప్రజలు ఇలాంటి పందారాలను కోరుకోలేదు. పనులు చేయాలను చూశారు. హావిూలను అమలు చేసి కొత్త తెలంగాణకు తెరతీయాలని చూశారు. నీటిపారుదల, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆయన చర్యలు తీసుకున్నా ఎందుకనో పెద్దగా ప్రజల్లో స్పందన కనిపించడంలేదు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఆయన కులవృత్తులకు ఆర్థిక సాయం అందించినా అది ఓట్ల కోసం చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. ఓటుకునోటు పథకాలు అమలవు తున్నాయన్న భావన ప్రజల్లో ఏర్పడింది. చెరువుల పూడికతీత అంతా ప్రచారంగా సాగింది. మిషన్‌ భగీరథ కూడా అంతే. ఇలాంటి వాటి ద్వారా లబ్ది పొందాలనుకున్నప్పుడు పటిష్టంగా కార్యక్రమాలు అము చేసి ఉంటే బాగండేది. అవేవీ చేయకుండా కేవలం ఎదుటి వారిని తిటటడం ఇప్పుడు రాజకీయ ప్రచరంగా మారింది. అటు విపక్షాలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఈ విమర్శలతో ఒనగూరే ప్రయోజనం సున్నా. ఇప్పటికైన పార్టీలు ప్రజలకు గట్టిగా ఫలానా పని చేస్తామని చెప్పగలగాలి.