కోబాడ్‌ గాంధీని బహిష్కరించిన మావోయిస్ట్‌ పార్టీ

వరంగల్‌,నవంబర్‌30(జనం సాక్షి): మావోయిస్ట్‌ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్‌ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్దాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి బూర్జువా సిద్దాంతాలకు మద్దతు ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రతినిధి అభయ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కోబాద్‌ గాంధీని మావోయిస్ట్‌ పార్టీ నుంచి కేంద్ర కమిటీ బహిష్కరించిందని తెలిపారు. 2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఫ్రాక్చర్డ్‌ ఫ్రీడం`ఏ ప్రిన్‌ మెమొయిర్‌ అనే పేరుతో పుస్తకం రాసి ప్రచురించారని చెప్పారు. ఆయన పుస్తకానికి పార్టీ త్వరలో బదులిస్తుందని అన్నారు. మార్క్సిజం`లెనినిజం`మావోయిజంతో గాంధీ పూర్తిగా వేరుపడ్డారని పార్టీ అర్ధం చేసుకున్నదని అన్నారు. ఈ మూడు అంశాలు తన 40 ఏండ్ల విప్లవజీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారని పేర్కొన్నారు. బూర్జువా నైతిక కధల సారాన్ని గ్రహించాలని గాంధీ అన్నారని అభయ్‌ ప్రస్తావించారు.