కోవింద్‌కు తమిళనాడు సీఎం మద్దతు

దిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు తాము మద్దతిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామి తెలిపారు. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంతేగాక, కోవింద్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం పళనిస్వామి నేడు దిల్లీ వెళ్తున్నట్లు పార్టీ పేర్కొంది.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిచ్చే విషయమై బుధవారం పార్టీ మంత్రులు, నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటనలో పేర్కొంది. చర్చల అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతివ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపింది. మరోవైపు ఎన్డీయే అభ్యర్థికి అన్నాడీఎంకే పార్టీకి చెందిన పన్నీర్‌ సెల్వం వర్గం కూడా మద్దతు తెలిపింది.రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. ఈ నామినేషన్‌ నాలుగు సెట్లపై ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు నేడు సమావేశమవనున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలను పక్కనబెట్టి.. జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొంత నిరాశలో ఉన్న విపక్ష పార్టీ.. నేడు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.